సాక్షి, హైదరాబాద్: రైతు పండిస్తాడు.. ఆ పంట మార్కెట్‌కు అక్కడి నుంచి వినియోగదారుడికి చేరాలి. ఇది సామాజిక ఆహారపు గొలుసు. ఇందులో ఎక్కడ లంకె తెగినా ప్రజలు ఇబ్బందిపడతారు. అది తీవ్రరూపం దాలిస్తే వారు దాడులకు దిగే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్ ఉద్దేశం తలకిందులవుతుంది. కోవిడ్ వైరస్ కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసులు ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఐదు రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా 24 గంటలు ఈ ఆహారపు గొలుసును కాపాడేం దుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇందు కోసం గ్రామా ల్లో ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం పెడుతున్నారు. రైతులంతా ముఖాలకు మాస్క్‌లు కట్టుకొని నిర్భయంగా వ్యవసాయం చేసుకోవచ్చని, పండించిన కూరగాయలు, పాలను ఇబ్బంది లేకుండా మార్కెట్లకు తరలించవచ్చని అభయమిచ్చారు. దీంతో రైతులు తాము పండించిన కూరగాయలను మార్కెట్లకు తీసుకొస్తున్నారు. ఈ బాధ్యతను గ్రామస్థాయిలో ఉండే కానిస్టేబుళ్లు తీసుకుంటున్నారు. ఇక తరలించిన పంటలను మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
తగ్గిన వాహనాల సంఖ్య: హైదరాబాద్‌లో గురువారం వాహన సంచారం బాగా తగ్గింది. పోలీసులు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాంకేతికతతో పనిచేసే సాఫ్ట్‌వేర్ సాయంతో కేసులు బుక్ చేస్తామని ప్రకటించారు. 3 కి.మీ. దూరం దాటే ప్రతి వాహనదారుడిపై కేసులు పెడతామని హెచ్చరించడంతో గురువారం హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు బాగా తగ్గాయి.
వస్తువుల సరఫరాకు పాసులు: డీజీపీ
నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు ప్రత్యేక పాసులు జారీ చేయాలని కమిషనర్లు, ఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏయే వస్తువులను ఎక్కడికి రవాణా చేస్తున్నారనే వివరాలు సేకరించి పాసులు ఇవ్వాలని సూచించారు.
రవాణా వాహనాలకు పెద్ద పోస్టర్లు...
కూరగాయలు, బియ్యం, ఇతర వంట సామగ్రిని సరఫరా చేసే వాహనదారులు తమ వాహనాల అద్దాలపై వారు ఏం రవాణా చేస్తున్నారో తెలిపేలా పెద్ద పోస్టర్లు అంటించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. అలాగే పలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు వాటి కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా లాక్‌డౌన్ నుంచి డీజీపీ మినహాయింపు ఇచ్చారు. ఉబర్, జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, మిల్క్ బాస్కెట్ ప్రతినిధులు యూనిఫారం, ఐడీ కార్డులు వేసుకుంటే చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి ఆటంకాలు ఉండవని డీజీపీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment