సాక్షి, సిటీబ్యూరో: కీళ్లనొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రి ఓపీకి వెళ్లిన బాధితులకు బీపీ తప్పడం లేదు. క్లీనికల్ ఎగ్జామ్, వైద్య పరీక్షల పేరుతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. అసలే విపరీతమైన కీళ్లనొప్పులతో బాధపడుతున్న రోగులకు ఓపీ టోకెన్లు, ఇతర పరీక్షల పేరుతో గంటల తరబడి నిలబెడుతుండడంతో నొప్పులు భరించలేక అక్కడే కుప్పకూలుతున్నారు. ఒకప్పుడు బొక్కల దవాఖానాగా గుర్తింపు పొందిన నిమ్స్ రమటాలజీ(కీళ్లనొప్పులు) విభాగానికి రోజుకు సగటున 300మంది వస్తుంటారు. ఒకప్పుడు ఎముకలకు సంబంధించిన వ్యాధులు, కీళ్ల నొప్పుల చికిత్సల్లో దేశంలోనే ఓ వెలుగు వెలిగిన ఆస్పత్రి ప్రస్తుతం తన ఉనికినే కోల్పోతోంది. అంతర్గత కుమ్ములాటలతో ఇప్పటికే సీనియర్ వైద్యులంతా ఆస్పత్రిని వీడిపోవడం, ప్రస్తుత రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల కనీస సేవలు అందించలేని దుస్థితినెలకొంది.
ఆస్పత్రిని వీడుతున్న వైద్యులు...
నిజానికి నిమ్స్ ఆర్థోపెడిక్ చికిత్సలకు పెట్టింది పేరు. అరుదైన చికిత్సలు, పరిశోధనలతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. సాధారణ పౌరులే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఇలా ఎవరికి ఏ సమస్య వచ్చినా చికిత్స కోసం ఇక్కడికే వచ్చేవారు. అంతర్గత రాజకీయాలతో ఇప్పటికే అనేక మంది వైద్యులు ఆస్పత్రిని వీడారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ శేషగిరిరావు, న్యూరో సర్జన్ డాక్టర్ సుభాష్‌కౌల్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ అజిత్‌కుమార్‌లు ఇటీవల పదవి విరమణ చేశారు. అంతర్గత విబేధాలతో ప్రముఖ హెమటాలజిస్టు డాక్టర్ నరేందర్ ఇటీవల ఆస్పత్రిని వీడిపోయారు. గతంలో న్యూరోసర్జన్ డాక్టర్ మానసపాణిగ్రహి సహా మరో న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ ఇష్టం లేకపోయినా ఆస్పత్రిని వీడిపోయినవారే. హృద్రోగ చికిత్సల్లో విశేష అనుభవంతో పాటు మంచి గుర్తింపు ఉన్న డాక్టర్ శేషగిరిరావు వెళ్లిపోవడంతో అప్పటివరకు ఆయన కోసం వచ్చిన వీఐపీ నగదు చెల్లింపు(పెయింగ్)రోగులంతా ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లిపోయారు. అదే విధంగా న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్ సుభాష్ కౌల్ రోగులది అదే పరిస్థితి.
డాక్టర్ నరేంద్ర ఆస్పత్రిని వీడడంతో హెమటాలజీ విభాగానికి వచ్చే రోగులకు కనీస వైద్యసేవలు అందకుండా పోయాయి. మధుమేహ చికిత్సల్లో మంచి గుర్తింపు పొందిన డాక్టర్ పీవీరావు పదవీ విరమణ పొందిన తర్వాత ఆ విభాగం జీవచ్ఛవంలా మారిపోయింది. సీనియర్లు లేని లోటును పూడ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. మెరుగైన వైద్య సేవలు పొందవచ్చేనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులకు కనీస వైద్యసేవలు కూడా అందకపోవడంతో వారంతా విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు బాటపట్టాల్సి వస్తోంది. ఆస్పత్రికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పెయింగ్ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ఇదే కారణం.
55శాతం నుంచి 20శాతానికి...
నాలుగేళ్ల క్రితం పెయింగ్ రోగులు 55 శాతం ఉంటే, ఆరోగ్యశ్రీ బాధితులు 45శాతం మంది ఉండేవారు. ప్రస్తుతం పెయింగ్ రోగుల శాతం పడిపోయింది. 80శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉంటే, 20శాతం మంది మాత్రమే పెయింగ్ రోగులు వస్తున్నారు. ఫలితంగా రోజూవారీ ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు ఈఎస్‌ఐ, సీజీహెచ్‌ఎస్, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ల వద్ద బకాయిలు కోట్లల్లో పేరుకుపోయాయి. పేరుకుపోయిన బకాయిలపై ప్రతి 15రోజులకోసారి సమీక్ష నిర్వహించి, వాటిని రాబట్టుకోవాల్సిన యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వేతనాల చెల్లింపు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేతనాల చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం నెలకు సుమారు రూ.12 కోట్లు అవసరం కాగా, రూ.9 కోట్లకు మించి రావడం లేదు. ఈ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఓపీ, వైద్య పరీక్షల చార్జీలను పెంచాల్సి వచ్చిందంటే ఆస్పత్రి ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment