![Peddapalli Collector Devasena Happiness Over Winning Swachhta Award - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/2/devasena2.jpg.webp?itok=ac23TCkL)
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన (పాత ఫొటో)
సాక్షి, పెద్దపల్లి : స్వచ్ఛ భారత్ మిషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ కేంద్రంలో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఇందులో భాగంగా కేంద్ర పారిశుద్ధ్య శాఖా మంత్రి ఉమాభారతి స్వచ్చ్ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 అవార్డులను ప్రదానం చేశారు. కాగా స్వచ్చతాలో 97.45 పాయింట్లతో దేశంలో మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దపల్లికి మొదటి స్థానం దక్కడం పట్ల కలెక్టర్ దేవసేన ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. రెండు అవార్డులు దక్కించుకుని పెద్దపల్లి జిల్లా దేశంలో పెద్దపులి లాంటి జిల్లాగా నిరూపించుకోవడం గర్వంగా ఉందన్నారు. స్వచ్చతా విషయంలో జిల్లాలో అనేక సంస్కరణలు చేపట్టామని ఆమె తెలిపారు. ప్రతి శుక్రవారం స్వచ్చ్ వారాన్ని ఏర్పాటు చేసి స్వచ్చతాను పెంపొందిస్తున్నామన్నారు. గ్రామాల్లో, ముఖ్య కూడళ్లలో చెత్తా చెదారం లేకుండా చేయడం ద్వారా దోమలను అరికట్టగలిగి, అంటు వ్యాధులను కొంత వరకు నిరోధించగలిగామని పేర్కొన్నారు.
మహిళల కోసం సబల కార్యక్రమం..
మహిళల కోసం ‘సబల’ పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దేవసేన తెలిపారు. రుతుక్రమ సమయంలో నార్మల్ ప్యాడ్‌ల వాడకం వల్ల గ్రామీణ స్థాయిలో మహిళలు గర్భసంచి, జ్ఞానేంద్రియాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు సబల ప్యాడ్‌లను తయారు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కలెక్టర్ నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్యాడ్‌లను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ ప్యాడ్లు పూర్తిగా పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా తయారు చేస్తున్నట్లు దేవసేన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment