సీపీఎం 18వ జిల్లా మహాసభలు శనివారం సూర్యాపేటలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జరిగిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరభద్రంతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.సూర్యాపేట : కమ్యూనిస్టు పురోగమనంలో అగ్రభాగానా నిలబడే పెద్దన్న నల్లగొండ జిల్లా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం 18వ జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా శనివారం రాత్రి సూర్యాపేటలోని గాంధీపార్కులో జరిగిన జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎర్రజెండా నాయకత్వంలో ప్రజలు నైజాంను గద్దెదించారని, వారి పాలన పోయి కాంగ్రెస్ సర్కార్ వచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినా.. పేదరికం పోలేదు.. పేదోడూ పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సమస్త సమస్యలు పరిష్కారమవుతాయని కొన్ని పార్టీలు ముందుకొచ్చినా సీపీఎం అభ్యంతరం చెప్పలేదన్నారు. సాక్షాత్తు ఉద్యమనాయకుడు కేసీఆర్ సీఎం అయ్యాడని, ఆయనను సీపీఎం ప్రతినిధి బృందం కలిసి ఉద్యమకాలంలో ఏం చెప్పారో.. సీఎం అయ్యాక నోటినుంచి ఏం మాట్లాడారో.. అదే చేయాలని కోరామన్నారు. ‘‘ఆరు నెలలు గడిచింది.. ఎక్కడుంది పాలన.. ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చారా.. కొలువులు, నీళ్లు, నిధులు వచ్చాయా’’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూ..దొందే : వీరయ్య
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ దేశాన్ని ఏళ్ల తరబడి పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిన పాపాలే నేడు బీజేపీ చేస్తుందని.. దొందూ..దొందేనని విమర్శించారు. మోదీ దేశంలో ఎక్కువ.. విదేశాల్లో తక్కువగా మాట్లాడుతున్నాడన్నారు. పదేళ్ల కాలంలో మన్మోహన్‌సింగ్ మౌనంగా ఉన్నారు.. నేడు మోదీ కూడా మౌనంగానే ఉంటున్నారని.. ఇద్దరికీ ఆచరణలో తేడా లేదన్నారు. రైల్వేలో విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూనే.. రైల్వేలను ప్రైవేటీకరించబోమని పేర్కొనడం ప్రజల చెవుల్లో బంగారు పూలు పెట్టడమేనని ఎద్దేవా చేశారు.
అరచేతిలో వైకుంఠం చూపించారు : చెరుపల్లి సీతారాములు
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి రకరకాల ప్రచారం.. చేసి గెలుపొందారని ఆరోపించారు. జిల్లాలో 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీ సం జిల్లా మంత్రి అయినా పరామర్శించడానికి రాలేదని.. కేసీఆర్ రెండు సార్లు జిల్లాకు వచ్చి నా ఒక్కమాట మాట్లాడలేదని ఆరోపించారు.
ఎర్ర జెండాయే శరణ్యం : జూలకంటి రంగారెడ్డి
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో దేశానికి దశా..దిశా చూపే ది ఎర్రజెండా ఒక్కటేనని తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ప్రజల బతుకులు మారలేదని, పాలకవర్గం అ నుసరిస్తున్న దుర్మార్గమైన విధానాలే ఇందుకు కారణమన్నారు. ఓట్ల కోసం.. సీట్ల కోసం.. సీపీఎం లేదని.. ప్రధాని పదవిని సైతం తిరస్కరించిన చరిత్ర సీపీఎంకు ఉందన్నారు.
గోల్కొండ కోటపై ఎర్రజెండా ఎగురవేస్తాం : మల్లు స్వరాజ్యం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ హైదరాబాద్ గోల్కొండ కోటపై ఎర్ర జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తామన్న సవాల్‌ను వెనక్కి తీసుకోలేదని పేర్కొన్నారు. బతుకమ్మల పేరిట కాగితపు బొమ్మలకు రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు. సభకు జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు ములకలపల్లి రాములు, తిరందాసు గోపి, పెన్నా అనంతరామశర్మ, తుమ్మల వీరారెడ్డి, డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పాలకులు మారినా.. పేదోడి బతుకు మారలేదు
Published Sun, Dec 28 2014 1:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement