రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి అహరహం పాటుపడిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, వారి ఆదరణతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి అహరహం పాటుపడిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, వారి ఆదరణతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం తన స్వగ్రామం ఆదిబట్లలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ప్రదాతగా వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోయారని, అందుకే వైఎస్సార్ సీపీని వారంతా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
వైఎస్ అభిమానులు, ఆయన పథకాలతో లబ్ధి పొందిన వారు నియోజకవర్గవ్యాప్తంగా వేలాదిమంది తనను కలిసి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అండగా ఉంటున్నందున వారంతా తనను ఆదరిస్తున్నారన్నారు. సొంత గ్రామమైన ఆదిబట్లలో పార్టీలకతీతంగా ప్రజలు, నాయకులు తనకు మద్దతు తెలుపుతుండటం ఉత్సాహాన్నిస్తోందన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని, పార్టీ అధినాయకులు కూడా ఇబ్రహీంపట్నంలో పర్యటిస్తారని శేఖర్‌గౌడ్ వెల్లడించారు.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమార్తె షర్మిల ఈ ప్రాంతంలో పర్యటించారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన తాగు, సాగు నీరుతో పాటు విద్యుత్, రోడ్లు, పారి శుద్ధ్య సమస్యల పరిష్కారమే తన ప్రచార ఎజెండా అని చెప్పారు. ప్రతి పేదింటి బిడ్డ అభివృద్ధి చెందాలన్న వైఎస్ ఆశయ సాధనకు పాటుపడతానన్నారు. హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. సమావేశంలో గ్రామస్తులు పల్లె శ్రీనివాస్‌గౌడ్, సేగూరి రమేశ్, భూపతిగళ్ల వెంకటయ్య, పల్లె నరేందర్‌గౌడ్, గజ్జెల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.