
ఆధార్ కేంద్రం వద్ద గుమ్మిగూడిన ప్రజలు
వికారాబాద్ అర్బన్ : కొత్త ఆధార్ కార్డు పొందాలన్నా, ఉన్న దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి ఆధార్ తప్పనిసరి లింక్ చేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన మొదట్లో తీసుకున్న చాలా మందికి వారి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ లేదు.
ఓటీపీ నెంబర్ తెలుసుకునేందుకు ఆధార్ కేంద్రం నిర్వాహకులే వారి నెంబర్లు ఇచ్చి అప్పటికి పని ముగించారు. ఇటీవల బ్యాంకుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా సొంత ఫోన్ నెంబర్ ఆధార్ లింకు ఉండాలని చెబుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలామంది మార్పులు చేర్పుల కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారు. మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసినా సకాలంలో పని జరగడంలేదు.
కొత్తగా కార్డు తీసుకోవాలనుకునే వారు రెండింతలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల డిగ్రీ ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింకు ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అడుగుతున్నారు.
ఇటీవల పోలీసులు రోడ్డుపై వాహనదారులు ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా, హెల్మెట్ లేకున్నా పిట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులకు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. దీనికి ఫోన్ నెంబర్ తప్పకుండా లింక్ ఉండాల్సి వస్తోంది. ఇలా ప్రతిదానికి ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో పాటు దానికి ఫోన్ నెంబర్ ఉండాలనడం మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది.
జిల్లా కేంద్రంలో ఒకేఒక ఆధార్ కేంద్రం ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలన్నా, కొత్త కార్డు తీసుకోవాలన్నా వారం రోజుల సమయం పడుతుంది. ఆధార్ కార్డు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని అధికారులు మరో ఆధార్ కార్డు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment