సామాజిక పింఛన్ల పథకానికి(ఆసరా) గంట మోగింది.
సామాజిక పింఛన్ల పథకానికి(ఆసరా) గంట మోగింది. బుధవారం నుంచి పింఛన్ డబ్బులు అర్హులకు ఇచ్చేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. గతనెలలోనే ఈ డబ్బులు పంపిణీ చేయాల్సి ఉండగా.. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యతో నెలపాటు జాప్యం జరిగింది. తాజాగా సాంకేతిక సమస్యను అధిగమించిన అధికారులు.. బుధవారం నుంచి ఈనెల 15వతేదీ వరకు అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేసేందుకు చర్యలు చేపట్టారు.
ఆసరా పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,99,742 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకంలో భాగంగా జిల్లాలో 3,60,849 మంది దరఖాస్తులు సమర్పించారు. వీటిని పరిశీలించిన తనికీ బృందాలు 2,30,524 మందిని అర్హులుగా తేల్చాయి. ఇలా గుర్తించిన వారి వివరాలను సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చి 1,99,742 మందిని లబ్ధిదారులుగా నిర్ధారించారు. ఈ క్రమంలో బుధవారం నుంచి లబ్ధిదారులకు పింఛన్లు అందనున్నాయి. నవంబర్ నుంచే ఆసరా అమలుచేస్తున్న నేపథ్యంలో గత నెలలో డబ్బులు అందని లబ్ధిదారులకు తాజాగా బకాయి డబ్బులతో కలిపి రెట్టింపు నగదును అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అనర్హులు 1.57లక్షలు..
పింఛన్ల కోసం వచ్చిన అర్జీల్లో 3,56,851 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు.. 2,30,524 మంది పింఛన్లకు అర్హులుగా తేల్చారు. ఈ క్రమంలో అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించిన పేర్లకు సంబంధించి వివరాలను సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చగా.. కేవలం 1,99,742 మంది అసలైన లబ్ధిదారులుగా ఎంపీడీఓలు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ వివరాలను కలెక్టర్ ఆమోదిస్తూ అందుకు సంబంధించి డబ్బులను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో రెండు దఫాల్లో 1,57,109 మందిపై అనర్హత వేటు పడింది. పింఛన్ల జాబితాలో పేర్లు లేని వారంతా తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.