కొణిజర్ల : సాధారణంగా ఓ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే అధికారులు సవాలక్ష నిబంధనలు పెడతారు. ఆ ధ్రువ పత్రం కావాలి, ఈ అధికారి అనుమతి కావాలి అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారు. అదే రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం అధికారులకు నిబంధనలు పట్టవు. కనీసం వారి వైపు కూడా తిరిగి చూడ కుండా ఉంటారు. మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలియడమే ఇందుకు నిదర్శనం. ఎటువంటి అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నా, వ్యాపారాలు నిర్వహిస్తున్నా అధికార్లు ఏమీ పట్టనట్టు ఉంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మండలం లోని కొణిజర్ల,తనికెళ్ల, అమ్మపాలెం, దుద్దెపూడి , పల్లిపాడు,చిన్నమునగాల తదితర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు కుప్పలు తెప్పలుగా విస్తరిస్తున్నాయి.వీటిలో ఒక్కదానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదు. కొన్ని వ్యవసాయ భూముల నుంచి వ్యవసాయేతర భూమిగా కూడా మార్పు చేయలేదు. అయినా దర్జాగా ప్లాట్ల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ. కోట్లలో ధరలు పలుకుతుంటడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే అందుకు ప్రభుత్వం నుంచి 5 రకాల అనుమతులు పొందవలసి ఉంటుంది.ఈ ధ్రువపత్రాలు వివిధ శాఖల నుంచి తీసుకువచ్చి పంచాయతీరాజ్ వారికి ఇచ్చి వారి నుంచి అనుమతి పొందాలి.కాని అటువంటిది ఏమీ లేకుండా ముందు ప్లాట్లు చేసి అమ్మేద్దాం ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు చూసుకుందాములే అన్నట్లుగా వ్యవ హరిస్తున్నారు రియల్టర్‌లు.
ఈ పత్రాలు తప్పని సరిగా ఉండాలి.
వెంచర్లకు సంబంధించి ఆర్డీఓ నుంచి వ్యవసాయ భూమిని వ్యవసాయేత భూమిగా భూమార్పిడి పత్రం తీసుకోవాలి.గ్రామ కార్యదర్శి అనుమతి పత్రం, ఈసీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇండివిడ్యువల్ అప్రూవల్, మండల సర్వేయర్ ఇచ్చే టోపోప్లాన్ రిపోర్టు అనే అయిదు రకాల ధ్రువపత్రాలు తప్పని సరిగా ఇవ్వవలసి ఉంటుంది. ఎవ్వరూ కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకోరు కేవలం ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని ప్లాట్లుగా విభజిస్తారు.
ఈ అయిదు రకాల ధ్రువపత్రాలు పంచాయతీ రాజ్ శాఖకు ఇచ్చి వారి నుంచి అనుమతి పొందాలి. ఇందుకోసం మొత్తం వెంచర్ వేసే భూమిలో 10 శాతం గ్రీన్ బె ల్ట్ కోసం గ్రామ పంచాయతీ పేరమీద రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి.ఇవేమీ లేకుండా ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తున్నారు. అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలో ఇండ్లు , ప్లాట్లు కొన్నవారికి నష్టం జరుగుతుందని ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్ సౌకర్యం ఉండదని చెప్పే టౌన్ ప్లానింగ్ అధికార్లు వెంచర్లపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
వాతావరణ కాలుష్యం బాగా పెరిగి పోతున్న తరుణంలో చెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి హరిత హారం పథకాన్ని ప్రవేశ పెట్టింది, అయితే ఉన్న చెట్లనే నరికి వెంచర్లు తయారు చేసి మొక్కల పెంపకాన్ని పట్టించుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అధికార్లు ఎటువంటి చర్యలు తీసుకోవడడం లేదు. వెంచర్లు,పరిశ్రమలు, ఇతర ప్రాజెక్ట్‌లకు సంబంధించి గ్రీన్ బెల్ట్ ఖచ్చితంగా అమలు చేయాలి.కాని మండలంలో వెంచ ర్లు వేసిన వారు రోడ్లను గ్రీన్ బెల్ట్ కింద చూపి మాయ చేస్తున్నారు. గ్రీన్ బెల్ట్ కింద భూమిని తీయకుండా ప్లాట్ల అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికార్లు స్పందించి గ్రీన్ బెల్ట్ స్టలాలను స్వాధీనం చేసుకుని చెట్టు పెంచాలని పలువురు కోరుతున్నారు.
అనుమతులు లేని రియల్ దందా
Published Mon, May 4 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement