
సాక్షి, సిటీబ్యూరో: కుక్కలంటే సాధారణ జనం భయపడతారు. ఇవి కరిస్తే రేబిస్ సోకుతుందని ఆందోళన వెంటాడుతుంది. అయితే, ఇపుడు పోలీసులు కూడా భయపడాల్సిన రోజులొచ్చాయి. ఇందుకు రేబీస్ కారణం కాదు.. శునకాల చోరీలు.. హత్యలు.. వాటిపై దాడులు. ఇటీవల కుక్కలకు సంబంధించిన కేసులు పెరిగిపోతుండటంతో పోలీసులు వాటిని ఛేదించడానికి తలపట్టుకుంటున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీసులు సైనిక్‌పురి నుంచి ఓ కుక్క చోరీ కావడంపై కేసు నమోదు చేశారు. దీని ఆచూకీ కనిపెట్టడానికి ఓ బృందాన్ని రంగంలోకి దింపి మరీ పట్టుకున్నారు. ఈ తరహా ‘కుక్కల కథలు’ ఎన్నో ఉన్నాయి.
కుక్కను చంపినందుకు కేసు
ఇటీవల వీధి, పెంపుడు కుక్కలపై చేయి చేసుకుంటున్న వాళ్లూ ఊచలు లెక్కపెట్టారు. పెంపుడు కుక్కను చంపిన వ్యక్తిపై ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. కొర్రెముల్ బాలాజీనగర్‌కు చెందిన జంతు ప్రేమికురాలు ప్రవల్లికకు జనవరి 13న సా యంత్రం రామశివ అనే వ్యక్తి ఫోన్ చేశారు. తాను పెంచుకుంటున్న కుక్క ‘టామీ’ని పక్కింటి యజమాని మహేష్ చంపేశాడంటూ వాపోయాడు. ఘటనాస్థలికి వెళ్ళిన ఆమె పరిశీలించగా కొన ఊపిరితో ఉన్న శునకం కనిపించింది. ఆమె మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ పశువుల ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ టామీ కన్నుమూసింది. దీంతో ఆమె ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధ్యుడిపై కేసు నమోదైంది.
రోడ్డుపై వదిలేసినందుకు..
తిరుపతికి చెందిన తరుణ్‌తేజ కృష్ణనగర్‌లో ఉంటున్నారు. ఆయనకు రెండు పెంపుడు కుక్కలు ఉండగా ‘మోజీ’ని బోరబండకు చెందిన హరి, ఆకాష్ కోరిక మేరకు పెంచుకునేందుకు ఇచ్చారు. దీన్ని తీసుకువెళ్ళిన తర్వాత వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అది అందరినీ కరుస్తుండటంతో తిరిగి తరుణ్‌కు ఇచ్చేయాల్సింది. కానీ వీరిద్దరూ అలా చేయకుండా, ఆయనకు సమాచారం లేకుండా కావూరిహిల్స్ వద్ద మోజీని వదిలేశారు. ఆ కుక్కపై మమకారంతో ఆరా తీసిన తరుణ్‌కు విషయం తెలియడంతో ఆయన.. హరి, ఆకాష్‌లపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు పెట్టారు.
కుక్కను కొట్టాడని హత్యాయత్నం
కుక్కను కొట్టిన పాపానికి ఓ వ్యక్తికి కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఉదంతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 26న జరిగింది. ఫిల్మ్‌నగర్‌లో కొబ్బరిబొండాల వ్యాపారం చేసే శ్రీనివాస్‌కు సంతానం లేదు. ఆయన ఓ వీధికుక్కను చేరదీసి ‘సాయి’ అని పేరు పెట్టుకుని ముద్దుగా పెంచుకుంటున్నాడు. బాలసుబ్రహ్మణ్యం అనే స్థానికుడు ఈ కొబ్బరి బొండాల దుకాణం పక్క నుంచి వెళ్తుండగా ‘సాయి’ అతడి వెంటపడటంతో రాయితో కొట్టాడు. ఇది చూసి ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్ తన చేతిలో ఉన్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేశాసి తీవ్రంగా గాయపరిచాడు. క్షతగాత్రుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
గతంలోనూ ఎన్నో కేసులు
♦ మాధవపురికి చెందిన శ్రీపాదరావు పెంపుడు కుక్కల్లో ఒకటైన ర్యాట్ విల్లర్ జాతి శునకం వాకింగ్ చేస్తున్న అదే ప్రాంతంలో నివసించే విశ్రాంత కల్నల్ కె.వినోద్‌కుమార్‌ను కరిచింది. దీంతో ఆ కుక్క తనను చంపడానికి ప్రయత్నించిందంటూ వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
♦ శంషాబాద్ మండలం సాతంరాయిలో ఫామ్‌హౌస్ ఉన్న న్యాయవాది బి.సుధాకర్‌రెడ్డి తన పెంపుడు కుక్కల్లో లాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్‌లను ఎవరో చంపేశారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
♦ బెంగళూరు వ్యక్తికి చెందిన రూ.3.5 లక్షల విలువ చేసే మేలుజాతి శునకం మీర్‌పేట్ టీచర్స్ కాలనీలోని ఓ సంస్థలో శిక్షణ పొందుతోంది. దీన్ని సంస్థకు చెందిన వ్యక్తి వాకింగ్‌కు తీసుకెళ్లగా వాహనం ఢీకొని చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట్ పోలీసులు డాక్టర్ సాయంతో కుక్క కళేబరానికి పంచనామా, పోస్టుమార్టం కూడా చేయించారు.
♦ కర్మన్‌ఘాట్ హనుమాన్‌నగర్‌లో ఉండే కె.శ్రీనివాస్ జర్మన్ షెఫర్డ్ జాతి కుక్కను పెంచుకుంటున్నారు. లెనిన్‌నగర్‌కు చెందిన వారు దాన్ని చోరీ చేశారు. కేసు నమోదు చేసుకుని శునకం ఆచూకీ కనిపెట్టిన పోలీసులు చోరీ చేసిన ముగ్గురు బాలల్ని జువైనల్ హోమ్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment