20 రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్‌ల పరిష్కారం
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ
హైదరాబాద్: ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్)కి సంబంధించిన క్లెయిమ్‌లు ఇకపై 20 రోజుల్లోనే పరిష్కారమవుతాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గతంలో క్లెయిమ్‌ల పరిష్కారానికి నెల వ్యవధిపట్టేదని తాజా నిర్ణయంతో 10 రోజుల ముందుగానే పీఎఫ్ ప్రయోజనాలను చందాదారులు పొందొచ్చని వివరించారు. కార్మికులకు రూ. 1,000 ఈపీఎఫ్ పింఛను పథకాన్ని కొనసాగిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని (బర్కత్‌పురాలో) ఈపీఎఫ్ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీఎఫ్ కార్యకలాపాలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలోని 39,734 పరిశ్రమల్లో 85.65 లక్షల మంది కార్మికులు, ఆంధ్రప్రదేశ్‌లో 35,218 కర్మాగారాల్లో 31.64 లక్షల మంది కార్మికులు ఈపీఎఫ్ చందాదారులుగా నమోదయ్యారన్నారు. ఈపీఎఫ్‌లో రూ. 6 లక్షల కోట్లు, ఇతర సంస్థల్లో రూ. 2 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని, ఈ సొమ్ముకు కార్మికశాఖ ధర్మకర్తగా వ్యవహరించి కార్మికులకు చెల్లింపులు చేస్తామన్నారు. 8 కోట్ల చందాదారులకు చెందిన రూ. 27 వేల కోట్ల అన్‌క్లెయిమ్డ్ సొమ్ము సంస్థ వద్ద ఉందని, ఇందులో తెలంగాణకు సంబంధించి రూ. 32 కోట్లు, ఏపీకి సంబంధించి రూ. 38 కోట్లు ఉందన్నారు. ఈ మొత్తాన్ని సంబంధిత చందాదారులకు చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.