పీఎఫ్‌పై వడ్డీరేటు 8.8 శాతానికి పెంపు
త్వరలో 8.9 శాతానికి పెంచే అవకాశం: కేంద్రమంత్రి దత్తాత్రేయ
చెన్నై: 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్)పై వడ్డీ రేటును 8.75 శాతం నుంచి 8.80 శాతానికి పెంచినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ట్రస్టీల కేంద్ర బోర్డు (సీబీటీ) 211వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పెంపు ‘మధ్యంతరమే’నని...దీన్ని మరోసారి సవరించే అవకాశం ఉందన్నారు.
వడ్డీ రేటును 8.90 శాతానికి పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్‌పై చర్చించేందుకు సీబీటీ త్వరలో మరోసారి సమావేశమవుతుందన్నారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకే తాము ప్రాధాన్యత ఇస్తామన్నారు. వడ్డీ రేటును 8.90 శాతినికి పెంచితే ప్రభుత్వం వద్ద ‘మిగులు’ రూ. 285 కోట్లుగా ఉంటుందని...8.8 శాతానికి పెంచినందు వల్ల అది రూ. 673 కోట్లుగా ఉంటుందన్నారు. కాగా, వడ్డీ రేటును 8.95 శాతానికి పెంచాలని...దీనివల్ల ప్రభుత్వం వద్ద రూ. 91 కోట్ల మిగులు ఉంటుందని ఈపీఎఫ్‌వో సలహా సంఘమైన ఆర్థిక, తనిఖీ, పెట్టుబడుల కమిటీ (ఎఫ్‌ఏఐసీ) సిఫార్సు చేసింది.
ఒక పేజీ పెన్షన్ దరఖాస్తు ఫారం విడుదల: సరళీకరించిన పెన్షన్ క్లెయిమ్ ఫారం 10డీ (యూఏఎన్ ఆధారిత)తోపాటు ఒక పేజీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) నమూనాను దత్తాత్రేయ అంతకుముందు విడుదల చేశారు. ప్రస్తుతమున్న 8 పేజీల పీపీఓ స్థానంలో తాము ప్రవేశపెట్టిన ఒక పేజీ పీపీఓ వల్ల పెన్షన్ జారీ ప్రక్రియ సమయం తగ్గడంతోపాటు ఈపీఎఫ్‌వో సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. పెన్షన్ క్లెయిమ్ ఫారం 10డీ (యూఏఎన్) ద్వారా కంపెనీల యాజమాన్యాల సంతకం అవసరం లేకుండానే చందాదారులకు ఈపీఎఫ్‌వో నేరుగా పెన్షన్ పొందే సేవను అందించగలడం సాధ్యమవుతుంది.