సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ విభాగంలో పోస్టింగ్ అంటే ఒకప్పుడు పనిష్మెంట్‌గా భావించేవాళ్లు. ఉన్నతాధికారులు సైతం ఆరోపణలు వచ్చిన, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులను ఈ వింగ్‌కే పంపేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సిటీ ట్రాఫిక్ విభాగంలో పోస్టింగ్స్ కోసం దరఖాస్తులు పెట్టుకునే, పైరవీలు చేయించుకునే పరిస్థితి వచ్చింది. ఈ మార్పునకు కారణం ఏమిటన్నది? ఉన్నతాధికారులకు అంతు చిక్కలేదు. పైకి కనిపించని ‘మర్మం’ ఏదైనా ఉందా? అని అనుమానించారు. దీంతో ఏకంగా ఈ వ్యవహారాన్ని నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌కు అప్పగించారు. లోతుగా విచారణ చేపట్టిన స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్‌లో పని ఒత్తిడి ఉండడం, ట్రాఫిక్ విభాగంలో ప్రోత్సాహకాలు ఇస్తుండడంతోనే సిబ్బంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారని తేల్చింది.
అప్పుడలా...
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల విభాగం పోలీస్‌స్టేషన్లు 60 ఉండగా, ట్రాఫిక్ ఠాణాలు 25 ఉన్నాయి. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ పీఎస్‌లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) పని చేయడానికి భారీ డిమాండ్ ఉండేది. ఎ–గ్రేడ్ ఠాణాల్లో పోస్టింగ్స్ కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచే పైరవీలు నడుస్తుండేవి. ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో పోస్టింగ్స్ అంశం దీనికి విరుద్ధంగా ఉండేది. అత్యంత అరుదైన సందర్భాల్లో మినహా ట్రాఫిక్ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌ఓగా వెళ్లడానికి ఎవరూ సుముఖత చూపేవారు కాదు. ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మార్చాలంటూ అధికారుల చుట్టూ తిరిగేవారు. దీంతో ప్రతిసారి బదిలీల సందర్భంలో ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చేది. కొన్నాళ్లు ట్రాఫిక్‌లో పని చేయాలని, ఆపై మంచి పోస్టింగ్ ఇస్తామని చెప్పి బాధ్యతలు చేపట్టేలా చేసేవారు.
ఇప్పుడిలా...
గడిచిన కొన్నాళ్లుగా ట్రాఫిక్ విభాగానికీ కొద్దికొద్దిగా ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. కౌంటర్ ఇంటెలిజెన్స్(సీఐ) సెల్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) తదితర విభాగాల్లో ఇస్తున్నట్లు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభమైంది. రాష్ట్ర నేర పరిశోధన విభాగంతో (సీఐడీ) పాటు ట్రాఫిక్ వింగ్‌కు ప్రోత్సాహకంగా జీతానికి 30శాతం అదనం ప్రకటించారు. దీంతో ఈ విభాగంలోకి వెళ్లడానికి అధికారులు ఉత్సాహం చూపారు. అయితే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ విభాగానికి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందినవారు, ఇతర విభాగాలు/యూనిట్స్ నుంచి వచ్చి రిపోర్ట్ చేసిన ఇన్‌స్పెక్టర్లు తమకు ట్రాఫిక్ వింగ్‌లోనే పోస్టింగ్ కావాలని కోరుతున్నారు. ఈ రకంగా ఉన్నతాధికారులకు ఒకేసారి 25 దరఖాస్తులు వచ్చాయి. దీంతో అసలు ట్రాఫిక్ విభాగం మీద ఇంత ‘ప్రేమ’ ఎందుకు పుట్టుకొచ్చింది? పైకి కనిపించని ‘ప్రత్యేక కారణాలు’ ఏమైనా ఉన్నాయా? అనేది తేల్చాల్సిందిగా ఉన్నతాధికారులు ఎస్బీని రంగంలోకి దింపారు.
డిమాండే కానీ...
అనూహ్యంగా వచ్చిన డిమాండ్‌కు కారణాలు గుర్తించడానికి ఎస్బీ సిబ్బంది విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో నిశితంగా పరిశీలించిన నేపథ్యంలో ‘ప్రత్యేక కారణాలు’ లేవని తేల్చారు. కేవలం లా అండ్ ఆర్డర్ వింగ్‌లో పని ఒత్తిడి, ఇతర అంశాలను అధికారులు తట్టుకోలేకపోతున్నారని.. దీనికి తోడు ట్రాఫిక్ వింగ్‌లో 30 శాతం అదనంగా రావడం వీరిని ఆకర్షిస్తోందంటూ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ అదనపు ప్రోత్సాహకం కేవలం ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి వరకే వర్తిస్తోంది. దీంతో ఆ కేడర్ వరకే డిమాండ్ ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారులు ఈ ప్రోత్సాహకం పరిధిలోకి రాకపోవడంతో అక్కడ కథ షరామామూలే అని తెలిపారు. కేవలం హైదరాబాద్‌లోనే పోస్టింగ్ కావాలనుకున్నోళ్లు, తాత్కాలిక ప్రాతిపదికనో మాత్రమే ఈ స్థాయిల్లో ట్రాఫిక్ వింగ్‌పై ఆసక్తి చూపుతున్నారని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment