5 కోట్ల టన్నుల బొగ్గు ఇవ్వండి
కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 50 మిలియన్ టన్నుల (5 కోట్ల టన్నులు) బొగ్గును కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాది, దక్షిణాది గ్రిడ్‌ల మధ్య అనుసంధానానికి చేపడుతున్న ట్రాన్స్‌మిషన్ కారిడార్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని కోరారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలిసిన గోయల్ ఆయనతో సమావేశమయ్యారు.
సీఎం విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టిసారిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదే ప్రజలకు కోతల్లేని విద్యుత్ సరఫరా చేయడంపట్ల రాష్ట్ర ప్రభుత్వానికి గోయల్ అభినందనలు తెలిపారు. ఒకే ఏడాదిలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ఉత్పత్తికి సిద్ధం కావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సౌర విద్యుత్ విధానం బాగుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రికి బొగ్గు కేటాయింపులు, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణంపైనా లేఖలు సమర్పించారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందంతోపాటు అక్కడి నుంచే మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు వీలుగా వార్దా-నిజామాబాద్-హైదరాబాద్, అంగూల్-పలాస-వేమగిరి-ఖమ్మం-హైదరాబాద్, వరోరా-వరంగల్ మార్గంలో 765 కేవీ లైన్ల నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని కోరారు.
జెన్‌కో ప్రాజెక్టులకు 29.30 మిలియన్ టన్నులు, ఎన్టీపీసీ ప్రాజెక్టుకు 20 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయింపులు జరపాలన్నారు. గతంలో బీపీఎల్ కంపెనీకి 3.5 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయింపులు జరిగాయని,కానీ ఆ సంస్థ విద్యుత్‌ఉత్పత్తి నుంచి తప్పుకున్నందున ఆ కేటాయింపులను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.