అధ్యయనం... అందని దూరం
- అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్లకు గ్రహణం
- కొన‘సా...గుతున్న’ రీజనల్ రింగ్ రోడ్డు స్టడీ
- గడువు దాటినా అందని నివేదికలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఆవిష్కరించేందుకు ఓ వైపు ప్రణాళికలు రూపొందిస్తున్నా... మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టులపై హెచ్‌ఎండీఏ తలపెట్టిన అధ్యయనాలు మాత్రం అతీగతీ లేకుండాపోయాయి. నిర్ణీత గడువు ముగిసినా నివేదికలు సమర్పించే విషయంలో ఏజెన్సీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శివారు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన హెచ్‌ఎండీఏ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం ఆ సంస్థలకు కలిసొచ్చింది. నగరంపై ఒత్తిడిని తగ్గించేందుకు చుట్టుపక్క ఉన్న అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రాంతాల ను రాజధానితో అనుసంధానం చేస్తూ రోడ్ నెట్‌వర్క్‌ను కల్పించడం ద్వారా త్వరిత అభివృద్ధికి గల అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ టీఓజీసీ (ట్రాన్జిడ్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్స్), మెట్రో రైల్ కారిడార్‌లో టీఓడీ(ట్రాన్జిడ్ ఓరియంటెడ్ డెవలప్‌మెంట్)లకు గల అవకాశాలపై సమగ్ర నివేదికను కోరింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ అధికారులు అధ్యయన బాధ్యతలను ‘లీ అసోసియేట్స్’ సంస్థకు అప్పగించారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 4 జిల్లాలను కలుపుతూ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి ‘ఆర్వీ అసోసియేట్స్’ సంస్థతో అధ్యయనం ప్రారంభించింది. దీనికి సుమారు రూ.1.50 కోట్లు వెచ్చించింది. వీటితో చేసుకున్న ఒప్పందం ప్రకారం అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్స్‌పై ఇప్పటికే ప్రాథమిక నివేదిక, రీజనల్ రింగ్ రోడ్డుపై డ్రాఫ్టు రిపోర్టు అందాల్సి ఉంది. వీటిని హెచ్‌ఎండీఏ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ అధ్యయనాలు స్తంభించిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మందగమనం...
నగరం చుట్టు పక్కల 4 జిల్లాలను కలుపుతూ బృహత్ ప్రణాళికలో ప్రతిపాదించిన 290 కి.మీ. రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి మొదట్లో అధ్యయనం వేగంగా సాగినా... ఆ తర్వాత మందగించింది. నిర్దిష్ట గడువు దగ్గరపడినా ఇంతవరకు ఫీజుబులిటీ రిపోర్టును కూడా ఆ సంస్థ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టుల అధ్యయనాన్ని త్వరగా పూర్తిచేసి నిర్దిష్ట వ్యవధిలోగా నివేదిక రూపొందిస్తే నిధులు ఏమేరకు అవసరమన్నది స్పష్టమవుతుంది. అవసరమైన చోట్ల వివిధ ప్రాంతాల్లో భూసేకరణకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న రోడ్డును వివిధ ప్రాంతాల్లోని రోడ్లతో (లింక్) కలిపి అభివృద్ధి చేస్తే ప్రధాన మార్గంతో అనుసంధానమై...మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. తొలిదశలో దీనికోసం రూ.10 కోట్లు వెచ్చిస్తే కొన్ని ప్రాంతాలకు రోడ్ నెట్‌వర్క్ సమకూరే అవకాశం ఉంది.
అధ్యయన నివేదికలు రూపొందకపోవడంతో ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురైంది. బడ్జెట్ సమావేశాల నాటికి ఆ నివేదికలు అంది ఉంటే ఎంతో కొంత నిధుల కేటాయింపు జరిగేది.లేదంటే... పీపీపీ మోడ్‌లో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి ఓ విధాన నిర్ణయం వెలువడేది. రీజనల్ రింగ్‌రోడ్డుపై అటు హెచ్‌ఎండీఏ గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఆరా తీయకపోవడంతో అధ్యయన సంస్థ సేదతీరుతోంది. ఇప్పటికైనా హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా శ్రద్ధ తీసుకొని అధికారులను పరుగెత్తిస్తే తప్ప అధ్యయనాలు కొలిక్కి వచ్చే అవకాశమే లేదన్నది సుస్పష్టం.