చోరీలు ఒకచోట.. జల్సాలు మరోచోట
► రెండుసార్లు జైలుకెళ్లొచ్చినా బుద్ధి మారలేదు
► తాళం వేసిన ఇళ్లే టార్గెట్
► ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
► రూ.4 లక్షల విలువైన బంగారం, ఇతర వస్తువుల స్వాధీనం
► నిందితుడితో పాటు సహాయకుడికీ కటకటాలు
► వివరాలు వెల్లడించిన ఏసీపీ గంగారెడ్డి
అత్తాపూర్: రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మార్చుకోని ఓ నిందితుడిని, అతడి సహాయకుడిని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. రూ. 4లక్షలకుపైగా విలువ చేసే బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఏసీపీ గంగారెడ్డి విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని చింతల్‌మెట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ గౌస్ పాషా (22) చిన్న తనం నుంచి దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాడు. 2011లో నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసి జువైనల్ హోంకు వెళ్లి వచ్చాడు. అనంతనం 2013లో మరో రెండు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడు.
దీంతో కులపెద్దలంతా కలిసి తల్లితండ్రులను ఒప్పించి అతనిలో మార్పు తెచ్చేందుకు ముంబైలోని జమాత్‌కి పంపారు. అక్కడికి వెళ్లిన పాషా చెడు అలవాట్లకు బానిసగా మారాడు. తిరిగి దొంగతనాలు ప్రారంభించాడు. చోరీ డబ్బుతో 15రోజుల పాటు ముంబైలో జల్సా చేసేవాడు. 15 రోజుల అనంతరం నగరానికి తిరిగి దొంగతనం చేయడం వెళ్లడమే పనిగా పెట్టుకున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెల్ చేసి బంగారం, డబ్డును మాత్రమే దొంగతనం చేసేవాడు. ఇదే క్రమంలో పాషా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 10 దొంగతనాలు, లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌లో ఒక దొంగతనం చేశాడు.
వరుస దొంగతనాలపై నిఘాపెట్టిన రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం ఉదయం పాషాతో పాటు అతడి సహాయకుడు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కృష్ణతో కలిసి పాషా ఓ బైక్‌ను దొంగిలించాడు. పాషా దగ్గర నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి, 3 టీవీలు, రెండు బైక్‌లు, ఒక ల్యాండ్‌కు సంబంధించిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన పొలీసులు పాషాపై పీడి యాక్టు నమోదు చేస్తామని తెలిపారు. వీరితొ పాటు ఉండే మరో దొంగ పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఓ కార్పొరేటర్‌కు సంబంధించిన కారు కాలిపోవడానికి కారణం కూడా పాషా అని పోలీసులు నిర్ధారించారు. విలేకరుల సమావేశంలో డీఐ నాగయ్య, ఎస్సై శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.