సాక్షి, హైదరాబాద్ : ఏదైనా ఇంట్లో భారీ మొత్తంలో దొంగతనం జరిగితే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. పోలీసుల చాకచక్యంతో కొన్ని గంటల్లోనే చోరుడు చిక్కి, డబ్బు రికవరీ అయితే... అక్కడితో తీరిపోతాయి. అయితే సోమాలియన్ అలీ చేతిలో బాధితుడిగా మారిన షకీల్ పరిస్థితి వేరుగా ఉంది. చోరీ జరగడం, దొంగ దొరకడం, 84 శాతం రికవరీ కావడం... ఇవన్నీ కేవలం 36 గంటల్లోనే పూర్తయ్యాయి. ఇక్కడితో షకీల్‌కు వచ్చిన ఇబ్బంది తీరలేదు సరికదా... కొత్త ఇక్కట్లు ప్రారంభం కానున్నాయి.
భారీ మొత్తం నగదు రూపంలో లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దృష్టికి తీసుకువెళ్లాలనుకోవడమే ఇందుకు కారణం. టోలిచౌకి నదీంకాలనీకి చెందిన మహ్మద్ షకీల్ వృత్తిరీత్యా రియల్టర్. షానవాజ్‌తో పాటు మరో వ్యక్తితో కలిసి ఇళ్లు నిర్మించి విక్రయించేవాడు. గచ్చిబౌలిలోని సిద్ధిఖీనగర్‌లో 100 గజాల్లో నిర్మించిన ఇంటిని ఇటీవల అజీజ్ అనే వ్యక్తికి విక్రయించాడు. అడ్వాన్స్‌గా అజీజ్ రూ.50 లక్షల నగదు ఇచ్చారు.
ఇందులో రూ.17 లక్షలు షానవాజ్ తీసుకువెళ్లగా... మిగిలిన రూ.33 లక్షలు తన ఇంటి బీరువాలో దాచాడు. ఈ మొత్తాన్నే ‘లాయర్ ఖర్చుల కోసం’ సోమాలియాకు చెందిన మహ్మద్ వలీ అలీ మహ్మద్ సోమవారం మధ్యాహ్నం చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు 36 గంటల్లో కేసును ఛేదించి సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఇతడి నుంచి ఖర్చుపెట్టగా మిగిలిన రూ.27,71,780 రికవరీ చేశారు.
కొత్త కష్టాలు...
శనివారం మధ్యాహ్నం బాధితుడు షకీల్ గోల్కొండ పోలీసులను ఆశ్రయించాడు. తన ఇంట్లో బీరువాలో ఉన్న రూ.33 లక్షలు చోరీ అయ్యాయంటూ ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రాథమికంగా షకీల్ కథనంపై అనుమానం వ్యక్తం చేశారు. భాగస్వాముల మధ్య రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో ఈ కథ నడిచి ఉంటుందని భావించారు. చివరకు సీసీ కెమెరాల్లో చిక్కిన ఆధారాలను బట్టి కేసును ఛేదించి సోమాలియన్‌ను అరెస్టు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బాధితుడు షకీల్‌తో పాటు అతడి భాగస్వామి షానవాజ్, వీరి నుంచి ఇల్లు కొనుగోలు చేసిన అజీజ్‌కు కొత్త కష్టాలు చుట్టు ముట్టే ప్రమాదం పొంచి ఉంది. రియల్ ఎస్టేట్ క్రయవిక్రయాల్లో ‘బ్లాక్’, ‘వైట్’ రూపంలో నగదు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. రికార్డుల్లో పొందుపరిచిన విలువను వైట్‌గా, మిగిలింది బ్లాక్ మనీగా తీసుకోవడం జరిగేది. గత ఏడాది నవంబర్‌లో డీమానిటైజేషన్ తర్వాత నగదు లావాదేవీలకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా మారాయి. రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు చేయకూడదు. అంతకంటే ఎక్కువ మొత్తం లావాదేవీలు చేయాల్సి వస్తే కచ్చితంగా బ్యాంక్ ద్వారానే చేయాలి. దీంతో బ్లాక్ అనేది నిబంధనలకు విరుద్ధంగా మారిపోయింది.
నిబంధనలు భే ఖాతరు
గచ్చిబౌలి సిద్ధిఖ్‌నగర్‌లోని ఇంటి క్రయవిక్రయం విషయంలో షకీల్, అజీజ్, షానవాజ్ ముగ్గురూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఇల్లు ఖరీదు చేయడానికి రూ.50 లక్షలు నగదు రూపంలో చెల్లించి అజీజ్, ఆ మొత్తం తీసుకుని షకీల్, అందులో నుంచి రూ.17 లక్షలు ముట్టిన షానవాజ్ ముగ్గురూ తప్పు చేసినట్లే లెక్క. చోరీ జరగకపోయి ఉంటే ఈ విషయాలు ఎక్కడా బయటకు వచ్చేవి కాదు. అయితే సోమాలియన్ ‘పుణ్యమా’ అని ఇప్పుడు లావాదేవీలు పోలీసు రికార్డుల్లోకి ఎక్కాయి.
ఈ వ్యవహారంలో రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిగిన నేపథ్యంలో విషయాన్ని ఐటీ అధికారులకు దృష్టికి తీసుకువెళ్ళాలని పోలీసులు నిర్ణయించారు. వారు రంగంలోకి దిగితే ముగ్గురికీ నోటీసులు జారీ చేస్తారని, నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు గుర్తిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటారని పోలీసులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment