సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సిటీ సెంటర్ మాల్‌లో 20 రోజుల క్రితం హల్‌చల్ చేసిన ‘ఎంపీ కుమార్తె’ను బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. సిటీకి చెందిన ఓ వ్యాపారి కుమార్తె అయిన ఆమెకు ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శితో దురుసుగా ప్రవర్తించిన కేసులో నోటీసులు జారీ చేశారు. గత నెల 22న టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి సురేష్ దంపతులు బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సిటీ సెంటర్ మాల్‌కు షాపింగ్ కోసం వచ్చారు. పని ముగించుకొని లిఫ్ట్‌లో కిందికి వచ్చిన వారిని ఎదురుగా వచ్చిన ఓ యువతి ఢీ కొట్టారు. తాను ఎంపీ కూతురునని... తమాషా చేస్తున్నావా..? ఖబడ్దార్...! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో వారు నీవే అడ్డుగా వచ్చి ఢీ కొట్టి తిరిగి మమ్మల్నే తిడుతున్నావంటూ వారు ప్రశ్నిస్తుండగానే సదరు యువతి... సురేష్ అతని భార్యపై దాడి చేశారు. అక్కడున్న వారు వారిస్తున్నా వినకుండా వారి కారుకు సైతం అడ్డుపడి దాని అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డుగా వచ్చిన మాల్ సెక్యూరిటీ గార్డులను తోసేశారు. ఈ ఉదంతంపై బాధితులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి వినియోగించిన ఫోర్డ్ కారు (టీఎస్ 10 ఈఎల్ 0777) నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె బాలం రాయ్‌కు చెందిన నగల వ్యాపారి కుశాల్ జయంతి లాల్ పర్మార్ కుమార్తె భవ్య పర్మార్(20)గా గుర్తించారు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకొని ఇటీవలే తిరిగి వచ్చారని, ఆ రోజు తన చిన్నమ్మ, చిన్నాన్నలతో కలిసి షాపింగ్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
అకారణంగా సురేష్ దంపతులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. భవ్య పర్మార్‌పై ఐపీసీ సెక్షన్ 323, 509, 341 కింద కేసు నమోదు చేశారు. సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సీఆర్పీసీలోని సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు జారీ చేశారు. ఆమె స్పం దించే తీరును బట్టి చర్యలు తీసుకోనున్నారు. కేసు పూర్వా పరాల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment