
పోలీసులే అసలైన హీరోలు
సూర్యాపేట : సినిమాల్లో పోలీసుల పాత్ర పోషించే వారు నిజమైన హీరోలు కాదు.. 24 గంటలూ శాంతిభద్రతలు పరిరక్షించే పోలీసులే నిజమైన హీరోలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ‘తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధునికీకరణ’ అనే అంశంపై బుధవారం సూర్యాపేట సమీపంలోని సదాశివరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సబ్ డివిజన్ స్థాయిలో నిర్వహించిన అవగాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. పోలీసులు రాత్రింబవళ్ళు విధులు నిర్వహిస్తూ మానసికి ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రజలు శాంతి కోరుకుంటున్నారని, సూర్యాపేటలో గత పరిస్థితులు రానివ్వనని, అధికార పార్టీని అడ్డుపెట్టుకొని తప్పులు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని గతంలోనే పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పానన్నారు.
పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీసులు అనే విధంగా ప్రజల దృష్టికి పోవాలని తెలిపారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసులు అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వారు మన కుటుం బాల నుంచి వచ్చిన వారేనన్నారు. ఎస్పీ టి.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతలు పరిరక్షిం చడంలో భాగంగా ఎందరో పోలీస్‌లు ప్రాణత్యాగాలు చేశారని, వారి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నామని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటే చాలా వరకూ నేర సంఘటన లు తగ్గుతాయని తెలిపారు.
కార్యక్రమానికి ముందు పోలీస్ అమరవీరుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకు ముందు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యం తో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. సుమారు 85 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళ్ళిక, ఆర్డీఓ శ్రీనువాస్‌రెడ్డి, డీఎస్పీలు శ్రావణ్‌కుమార్, శ్రీనువాస్, రామ్మోహనరావు, సీఐలు నర్సింహారెడ్డి, శ్రీనువాస్‌లుతో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు, రెడ్‌క్రాస్‌సొసైటీ చైర్మన్ మీలా సత్యనారాయణ, డిస్ట్రిక్ సెక్రటరీ ఆమరేందర్‌రావు, వైస్ పెసిడెంట్ ఇరిగి కోటేశ్వరీ, ఉప్పల రాజేంద్రప్రసాద్, అడ్వకేట్ రమాదేవి, దుర్గాబాయి, రాంచందర్‌నాయక్ పాల్గొన్నారు.