ఆ బైక్‌ ఎవరిది? | police searching for bike in vikram goud case | Sakshi
Sakshi News home page

ఆ బైక్‌ ఎవరిది?

Published Mon, Jul 31 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

ఆ బైక్‌ ఎవరిది?

ఆ బైక్‌ ఎవరిది?

విక్రమ్‌ ఇంటి సమీపంలో సీసీ కెమెరాల్లో రికార్డు
అతడి వాంగ్మూల కోణంలోనూ సాగుతున్న దర్యాప్తు
అనంతపురంలో ఆరా తీస్తున్న ప్రత్యేక బృందం

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల కేసు మిస్టరీని ఛేదించడానికి పది ప్రత్యేక బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఘటనా స్థలి పరిశీలన నుంచి పోలీసులు ఈ వ్యవహారంలో మరో వ్యక్తి ప్రమేయం లేదని అనుమానిస్తున్నారు. ఉదంతం జరిగిన తర్వాత పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా మొండికేసిన విక్రమ్‌ శనివారం నోరు విప్పి ఇద్దరు ఆగంతకులు ద్విచక్ర వాహనంపై వచ్చి కాల్పులు జరిపినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి వాంగ్మూలాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఉదంతం చోటు చేసుకున్న సమయంలోనే విక్రమ్‌ ఇంటికి కొద్దిదూరంలో ఉన్న ఓ సీసీ కెమెరాలో బైక్‌ కదలికలు రికార్డయ్యాయి. దీంతో విక్రమ్‌ వాంగ్మూలంలో సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తూ ఆధారాలు సేకరించడంపై పోలీసులు దృష్టి పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం జిల్లాలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఆగంతకులు బైక్‌పై వచ్చారు
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో ఓ స్నేహితుడిని కలసి 5 నిమిషాల్లోనే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.86లోని తన ఇంటికి వచ్చానని, స్నానం చేసి భార్య షిపాలిని సిద్ధం కావాల్సిందిగా చెప్పానని వాంగ్మూలంలో విక్రమ్‌ పోలీసులకు వివరించారు. పైఅంతస్తు నుంచి కిందికి వచ్చి డ్రాయింగ్‌ రూమ్‌ మెయిన్‌ డోర్‌ తెరిచి ఎదురుగా సోఫాలో కూర్చున్నానని, కూర్చున్న రెండు నిమిషాల్లోనే మంకీ క్యాప్‌ ధరించిన పొట్టిగా ఉన్న వ్యక్తి లోనికి ప్రవేశించి ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడని, తాను తేరుకునేలోపే మరో రౌండ్‌ కాల్చడంతో కుప్పకూలిపోయానని తెలిపారు. ఆ సమయంలో బయట మరో వ్యక్తి హెల్మెట్‌ ధరించి ఉన్నాడని, కాల్పుల అనంతరం ఇద్దరూ బైక్‌పై తమ ఇంటి సమీపంలోని దర్గా వైపు పారిపోయినట్లు తాను గమనించానని వివరించారు. తనకు అప్పులు ఉన్నట్లు, తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. ఘటనపై తన భార్య ఇచ్చిన ఫిర్యాదు ముమ్మాటికీ నిజమేనని చెప్పారు.

అనంతపురంలోనూ ప్రత్యేక బృందం
విక్రమ్‌ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని అనంతపురం జిల్లాకు పంపారు. దర్యాప్తు అధికారులు విక్రమ్‌గౌడ్‌ ఫోన్‌ కాల్‌డేటా సేకరించగా.. అందులో ఆయన అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది. ఈ ఉదంతం, వినియోగించిన ఆయుధంతో అనంతపురం వ్యక్తికి ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విక్రమ్‌ కాల్‌డేటాతో పాటు వాట్సాప్‌ వ్యవహారాలను కూడా అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. విక్రమ్‌ కాల్పుల కేసు దర్యాప్తునకు కీలక ప్రాధాన్యం ఇస్తున్నామని, సోమవారం నాటికి స్పష్టత రావచ్చని కేసును పర్యవేక్షిస్తున్న ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

సీసీ కెమెరాలో బైక్‌ ఆనవాళ్లు..
దర్గా సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను పోలీసులు పరిశీలించారు. అందులో శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగిన సమయంలో ఓ బైక్‌పై ఇద్దరు వేగంగా వెళ్లడం రికార్డు అయింది. అయితే అందులో ఆగంతకుల ఆహార్యం, బైక్‌ నంబర్‌ స్పష్టంగా లేకపోవడంతో వీడియో ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ విధానంలో ఫీడ్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దర్గా నుంచి అన్ని వైపులకు వెళ్లే రోడ్లలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను సైతం సేకరించి విశ్లేషించాలని నిర్ణయించారు. విక్రమ్‌ చెప్పినట్లు వీరిద్దరూ వచ్చి అతడిపై కాల్పులు జరిపారా? లేదంటే ముందు నుంచీ అనుమానిస్తున్నట్లు విక్రమ్‌ వేసిన పథకంలో ఇద్దరూ పాత్రధారులా అన్నది తేల్చడంపై దృష్టి పెట్టారు. కాల్పుల ఉదంతం విక్రమ్‌ సృష్టే అయితే ఆ ఇద్దరూ ఆయుధం అందించి, మళ్లీ తీసుకెళ్లి ఉండచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement