వడ్యాట్‌లో పల్లె నిద్ర చేస్తున్న పోలీసులు, గ్రామస్తులు
మోర్తాడ్: ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా పల్లెల్లో నిద్ర చేయడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. పోలీసులు ప్రజలతో మమేకమైతు సమస్యల పరిష్కారం కోసం వినూత్న పద్ధతికి అంకురార్పణ చేశారు. జిల్లా పోలీసు బాస్ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు ఆయా స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎంపిక చేసిన గ్రామాలలో పోలీసు అధికారులు ఒక రాత్రిపూట బస చేసి శాంతియుత వాతావరణం కల్పించడంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు. సాధారణంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని హరితహారం కార్యక్రమం అమలు చేసే సమయంలో పంచాయతీరాజ్, రెవెన్యూ, తదితర శాఖ అధికారులు చేపట్టేవారు.
కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో అప్పుడప్పుడు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఆరంభించడం ఇది తొలిసారి. వారానికి ఒక గ్రామంలో ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
తాజాగా మోర్తాడ్ మండలం వడ్యాట్‌లో నిర్వహించిన పల్లె నిద్రలో భీమ్‌గల్ సీఐ సైదయ్య, మోర్తాడ్ ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడలో నిర్వహించిన పల్లె నిద్రలో ఎస్‌ఐ ప్రభాకర్ పాల్గొన్నారు.
సమస్యలను తెలుసుకుంటున్నం
ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పల్లె నిద్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. పల్లె నిద్ర వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పల్లె నిద్ర వల్ల గ్రామంలోని సమస్యలను తెలుసుకుని ఇతర శాఖలకు సిఫారసు చేసే అవకాశం ఉంది. – సురేశ్, ఎస్‌ఐ, మోర్తాడ్
Comments
Please login to add a commentAdd a comment