
కరీంనగర్‌లో కేసీఆర్, సజ్జనార్ మాస్క్‌లు ధరించి మద్దతు ప్రకటిస్తున్న విద్యార్థినులు
సాక్షి, హైదరాబాద్: ‘సజ్జనహారం న్యాయానికి జయహారం ఓరుగల్లు భద్రకాళి కళ్లుతెరిచి ఆనతినిచ్చిన ప్రదోషకాలం అపరవీరభద్రుడై సజ్జనార్‌సలిపిన మృగ సంహారం’ సోషల్‌మీడియాలో ఇలాంటి మాటలెన్నో..
విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్.. ఇప్పు డు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. దమ్మున్న పోలీస్.. రియల్ సింగం.. ఇలాం టి పోలీస్ రాష్ట్రానికి కనీసం ఒక్కరన్నా ఉండాలి.. పోలీసులు ఎలా ఉండాలో ఈయనను చూసి నేర్చుకోవాలి.. ఐపీఎస్ అధికారిగా ఆయన తెలంగాణలో ఉన్నందుకు గర్విస్తున్నా.. అత్యాచారం చేసేవారికి వెన్ను లో వణుకుపుట్టే పేరు సజ్జనార్.. దేశవ్యాప్తంగా ‘యాంటీ రేప్ బ్యూరో’ఏర్పాటు చేసి దానికి బాస్‌గా సజ్జనార్‌ను నియమించాలి. శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ఇలాం టి కామెంట్స్ కోకొల్లలు. గత కొన్ని రోజులుగా యావత్తు దేశాన్ని కుదిపేస్తున్న ‘దిశ’కేసుకు ఓ ముగింపునిస్తూ చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ అంతకంటే పెద్ద సంచలనంగా మారింది. అత్యాచార నిందితుల్లో భయం పుట్టాలంటే తెలంగాణ పోలీస్ తరహా పనిచేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ‘సాహో.. సజ్జనార్’అంటూ నినాదం హోరెత్తుతోంది.
విమర్శలు పోయి ప్రశంసలు..
పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ‘దిశ’ఘటన జరిగి ఉండకపోయేదని కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం స్పందించలేదని, సీఎం ఆలస్యంగా స్పందించారని, హోంమంత్రి అభ్యంతరకరంగా మాట్లాడారని.. ఇలా ఒక టే విమర్శల దాడి. కానీ శుక్రవారం తెల్లవారుజామునే పరిస్థితి మారిపోయింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీ సులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను తెగపొగిడేస్తు న్నారు. కొన్ని చోట్ల ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసిన ఫొటోలు షేర్ చేస్తున్నా రు. సజ్జనార్ పేరు మారుమోగటంతో చాలామంది ఆయన వివరాల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నా రు. ఆయన పిస్టల్ పట్టు కుని ఉన్న ఫొటో ప్రధానంగా కనిపిస్తోంది.
ఇదీ సజ్జనార్ నేపథ్యం..
కర్ణాటకలోని దావణగెరె ప్రాంతానికి చెం దిన సజ్జనార్.. ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సజ్జనార్.. ఉమ్మడి ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు. జనగాం ఏఎస్పీగా, నల్లగొండ, మెదక్, కడప, గుంటూరు, వరంగల్ జిల్లా లతో పాటు సీఐడీలో ఎస్పీ గా పని చేశారు. డీఐజీగా, ఐజీగా పదోన్నతులు పొం ది వివిధ విభాగాల్లో కీలక విధులు నిర్వర్తించారు.
ఎవరినీ వదల్లేదు..
అసాంఘిక శక్తులపై మాత్రమే కాదు తీవ్రవాదులు, ఉగ్రవాదులు సైతం ఆయన తూటాలకు నేలకొరిగారు. డీఐజీగా పదోన్నతి పొందిన తర్వాత మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగమైన ఎస్‌ఐబీలో పనిచేశారు. ఐజీ అయ్యాక కూడా అక్కడే కొనసాగుతూ ఉగ్రవాద వ్యతిరేక నిఘా విభాగమైన కౌం టర్ ఇంటెలిజెన్స్ సెల్‌కు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ఐజీ హోదాలో గతేడాది సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా బదిలీపై వచ్చారు.
మూడు ఎన్‌కౌంటర్లు..
సజ్జనార్ ఎస్పీ హోదాలో ఉండగా రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ హోదాలో ఉండగా.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఈ మూడు కేసుల్లో కూడా ప్రధానంగా బాధితుల ‘కాల్చివేత’లే మూలంగా ఉన్నాయి. మెదక్ ఎస్పీగా పని చేస్తుండగా బిక్కు అనే గంజాయి స్మగ్లర్‌ను మట్టుపెట్టారు. తన వ్యవహారాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను పెట్రోల్ పోసి కాల్చేసిన బిక్కు ఆపై పోలీసుల కాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ నిందితులు కూడా ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయారు. ఇప్పుడు దిశ కేసులో కూడా బాధితురాలిపై పెట్రోల్ పోసి కాల్చేసిన నలుగురూ కస్టడీలో ఉండగా ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.
ఎన్‌కౌంటర్‌తో దిశకు న్యాయం జరిగిందంటూ శుక్రవారం కరీంనగర్‌లోని గీతాభవన్ చౌరస్తాలో వివిధ కళాశాలల విద్యార్థుల హర్షాతిరేకాలు
ఆయనది కీలకపాత్ర..
గ్యాంగ్‌స్టర్ నయీం ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన వారిలో సజ్జనార్ కూడా ఉన్నా రు. ఈయన హయాంలో కొనాపురి రాము లు, సాంబశివరావులు వంటి కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌కు ఇన్‌చార్జ్‌గా ఉండగా.. హుజీ, జేకేహెచ్, జేకేబీహెచ్ తదితర మా డ్యుల్స్‌కు చెందిన ఉగ్రవాదులు అరెస్టయ్యా రు. ఘరానా మోసాలకు పాల్పడే వైట్ కాలర్ నేరగాళ్లు కూడా ఈయన పేరుకు వణికిపోతారు. నల్లగొండ ఎస్పీగా ఉండగా అయస్కాంత పరుపుల పేరుతో జరిగిన జపాన్ లైఫ్ స్కామ్‌కు చెక్ చెప్పడంతో మొ దలు పెట్టిన సజ్జనార్ సీఐడీలో ఉండగా ఆమ్వే సంస్థ పైనా చర్యలు తీసుకున్నారు.
ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నాం
త్రేతాయుగంలో రావణుడు, ద్వాపర యుగంలో దుశ్శాసనుడు మన ఆడబిడ్డలను కేవలం ఎత్తుకెళ్లారు. కానీ ఈ యుగంలోని రాక్షసులు మన సీతలు, ద్రౌపదులను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి తగలబెడుతున్నారు. అలాం టప్పుడు రాముడు, కృష్ణుడిలా మారకుండా ఎంతకాలమని వారిని పూజిస్తూ ఉంటాం.– కైలాశ్ సత్యార్థి, నోబెల్ బహుమతి గ్రహీత
దిశ ఘటనలో తప్పించుకొనేందుకు యత్నించిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లు పోలీసులు చేసిన ప్రకటనను విశ్వసిస్తున్నా. రాష్ట్రంలో ఫామ్‌హౌస్ సీఎం, డమ్మీ హోం మినిస్టర్ ఉన్నా పోలీసులు మాత్రం బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారు. – అరవింద్, ఎంపీ
దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం శుభపరిణామం. దేశంలో మహిళలపై ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఇదే శిక్ష వేయాలి. తెలంగాణ పోలీసులను ఎంతోమంది తిట్టారు. అందులో నేనూ ఒకడిని. నిందితులను ఎన్‌కౌంటర్ చేసినందుకు పోలీసులకు హాట్సాఫ్. పోలీసులు ఇలా వ్యవహరిస్తేనే మహిళలపై దాడులు ఆగుతాయి. – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
నిందితులను ఉరితీయాలి లేదా ఎన్‌కౌంటర్ చేయాలన్న ప్రజల డిమాండ్ నెరవేరినందుకు సంతోషిస్తున్నా. నిందితులపై సత్వర చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. అవి చూసి దిశ లాంటి ఘటనలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. – కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
కేసీఆర్ సార్‌కు శతకోటి వందనాలు. మీ మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో మీ రియాక్షన్ అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని నిరూపించారు. –టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.చందర్
పోలీసు ఎన్‌కౌంటర్లను సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని, అయితే ప్రత్యేక కేసుగా భావిస్తూ దిశ నింది తుల ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నా. దిశపై హత్యాచార నింది తులపై దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించారు. రోడ్లపైకి వచ్చి వారిని కాల్చి చంపాలనే డిమాండ్ వచ్చిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. –సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
ఇలాంటి ఘటనల్లో నిర్దిష్ట కాలపరిధిలో దోషులకు వేగంగా శిక్షపడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. దిశ ఘటనలో దోషులకు కఠినశిక్ష పడాల్సిందే. ఇటీవల కొమురం భీం జిల్లాలో దళిత మహిళపై జరిగిన హత్యాచారం, వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న మానభంగం, హత్య ఘటనలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. – సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
దిశ అత్యాచారం, హత్య చేసిన వారికి సరైన శిక్ష పడింది. దీనికి స్వాగతిస్తున్నాం. సత్వర న్యాయం చేశారని భావిస్తున్నాం. ఇకపై రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హత్యాచారం చేసిన వారికి వెంటనే శిక్ష అమలయ్యేలా చట్టాలను మరింత కఠినంగా మార్చాలి. చట్టం తన పని తాను చేసుకుపోయిందని భావిస్తున్నాం. – గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు
దిశ నిందితులకు ఎన్‌కౌంటర్ ద్వారా తగిన శాస్తి జరి గింది. పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి నిందితులకు శిక్షపడేలా చేసి వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. శాంతిభద్రతలు కాపాడటంలో రాష్ట్ర పోలీసులు భేష్ అని రుజువైంది. – టీఎన్జీవో, రాష్ట్ర ఎంప్లాయిస్ అసోసియేషన్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టేకు లక్ష్మి, మానస సంఘటనల నిందితులను ఉరితీసి చూపించాలి. రాష్ట్రంలో దళిత, బహుజన వర్గాల పట్ల వివక్ష జరుగుతోంది. దిశ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం నిందితులను చంపడం మంచి విషయమే కానీ, అది రాజ్యాంగబద్ధంగా జరిగి ఉంటే బాగుండేది. ఉరిశిక్ష పడే అవకాశమున్న నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం దేనికి సంకేతమో చెప్పాలి. – చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే హాజీపూర్ నిందితున్ని కూడా కఠి నంగా శిక్షించాలి. మానవ మృగాలకు ఎన్‌కౌంటర్ ఒక గుణపాఠంగా మారుతుంది. దిశ, వరంగల్ హంతకుల మాదిరి గానే దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
ఎన్‌కౌంటర్ సరికాదు..
ఎన్‌కౌంటర్లకు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. నిందితులు పోలీసుల కస్టడీలో ఉండగానే ఈ ఎన్‌కౌంటర్ అయింది. దీనిపై మెజీస్టీరియల్ విచారణ జరగనుంది. అజ్మల్ కసబ్ లాంటి ఉగ్రవాది కేసులు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ కేసులో ఎందుకు అలా జరగలేదు. – అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ
పార్టీ నిర్ణయం వచ్చే వరకు ఎన్‌కౌంటర్‌పై స్పందించం. ఇది ఎమోషన్‌గా మాట్లాడే అంశం కాదు. చట్టం పని న్యాయస్థానం చేయదు. న్యాయస్థానం పని చట్టసభలు చేయవు. అత్యాచార నిందితులను ఎవరు వెనకేసుకురారు. ఏ వ్యవస్థ చేయాల్సిన పని.. ఆ వ్యవస్థ చేయాలి. ఈ ఎన్‌కౌంటర్‌తో సమస్య పరిష్కారం అయితే ఇబ్బంది లేదు. గతంలో ఎన్‌కౌంటర్ జరిగాక అత్యాచారాలు ఆగిపోయాయా. నాకున్న అనుమానాలపై శనివారం ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తా.. – కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి