
ఓ పోలింగ్ కేంద్రం వద్ద నిర్మిస్తున్న ర్యాంప్
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు ఓటర్ల జాబితా తదితర కార్యక్రమాలపై శ్రద్ధ చూపిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు ఇక పోలింగ్ కేంద్రాల వద్ద వసతులపై దృష్టి సారించారు. కనీస సదుపాయాలైన తాగునీరు, టాయిలెట్లు, కరెంట్, ఫ్యాన్లు, దివ్యాంగులకు అవసరమైన ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1,500 పైచిలుకు ప్రాంతాల వద్ద పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ర్యాంపుల నిర్మాణం చేపట్టారు. 1,413 ప్రాంతాల్లో ర్యాంపుల నిర్మాణం పురోగతిలో ఉందని అధికారులు పేర్కొన్నారు.
వీటితోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఎక్స్‌టెన్షన్ బాక్సులు అద్దెకు తీసుకోనున్నారు. 8,844 లైట్లు, 1,694 ఫ్యాన్లు, 4,058 స్పైక్‌లు అవసరమవుతాయనే అంచనాతో దాదాపు రూ.71.59 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు టాయిలెట్ సదుపాయం లేని చోట వాటిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో అవసరాన్ని బట్టి ఒకటి నుంచి మూడు ర్యాంపుల వరకు నిర్మిస్తున్నారు. పోలింగ్ ప్రదేశాల్లో కనీసం ఒక్క వీల్‌చైర్ అయినా అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమనుకున్న ప్రాంతాల్లో మూడు వీల్‌చైర్లు ఉంచనున్నారు.