
చెరువుల పునరుద్ధరణ ఉద్యమంలా సాగాలి
జిన్నారం: చెరువుల పునరుద్ధరణ ప్రజా ఉద్యమంలా సాగాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కూడా ఇస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిన్నారం మండలంలోని గుమ్మడిదల గ్రామంలో స్థానిక సీపీఐ నాయకులు ఏర్పాటు చేసిన విఠల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని హరీష్‌రావు ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, విఠల్‌రెడ్డి భౌతికంగా దూరమైనా ఆయన చేసిన సేవలతో నేటికీ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారన్నారు. పేదలకూ భూమి దక్కాలని విఠల్‌రెడ్డి చేసిన పోరాటం మరువలేనిదన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ కూడా అలాంటి మహానేతల బాటలోనే నడుస్తోందన్నారు. ఈ క్రమంలోనే దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల సాగుభూమిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘మన ఊరు- మన చెరువు’ అనే నినాదంతో గ్రామాల్లోని చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇందుకోసం తగిన నిధులను కూడా వెచ్చిస్తున్నామన్నారు.
పూడికతీసి...పొలంలో వేసి
గత ప్రభుత్వాలు చెరువుల్లోని పూడిక తీయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. దీంతో చెరువులన్నీ పూర్తిగా పూడికతో నిండిపోయి ఉనికి కోల్పోయాయన్నారు. అందువల్లే వాటిని పునరుద్ధరించేందుకు సర్కార్ సిద్ధమైందన్నారు. చెరువుల నుంచి తీసిన మట్టిని ఆయా గ్రామాల్లోని రైతుల పంట పొలాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెరువుల మట్టి పంట పొలాలకు వాడటం వల్ల, రసాయన ఎరువుల వాడకం తగ్గుదలతో పాటు, దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూ సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నేతల సలహాలను తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం సీఎంతో మాట్లాడి ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీపీఐతో తమకు భావసారూప్యత ఉందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర, నర్సాపూర్‌లలో కూడా విఠల్‌రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విఠల్‌రెడ్డి మూడో వర్ధంతిలోపు విగ్రహాలను ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తామన్నారు.
అనంతరం చాడా వెంకట్‌రెడ్డి, నారాయణలు మాట్లాడుతూ, పేదవాడికి భూమి హక్కు అనే నినాదంతో ముందుకెళ్లిన నేత విఠల్‌రెడ్డి అన్నారు. అలాంటి నేత వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పవన్‌కుమార్, రవీందర్‌రెడ్డి, చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్, బాల్‌రెడ్డి, ఇందెల సురేందర్‌రెడ్డి, మురళీయాదవ్, గౌరీశంకర్‌గౌడ్, నరేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, స్వేచ్ఛారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు కూడా విఠల్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.