'హామీలు నెరవేర్చకపోతే పతనమే'
19 నెలల్లో టీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు: పొంగులేటిభూపాలపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే టీఆర్‌ఎస్ పార్టీకి పతనం తప్పదని వైఎస్సార్‌సీపీ తెలంగాణఅధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో శనివారం పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 19 నెలల కాలంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రైతులకు ఒకే దఫా రూ. లక్ష రుణమాఫీ చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, ఇంటికో ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు.
దళితులు, గిరిజనులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్ భూపాలపల్లి నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చాడో చెప్పాలన్నారు. గణపురం మండలంలోని చెల్పూరు కేటీపీపీ మూడవ దశ 800 మెగావాట్ల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూపాలపల్లిని ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, డిస్మిస్డ్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదవారి ముఖంలో చిరునవ్వులు చూడటమే వైఎస్ లక్ష్యమని, అందుకోసం తమ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు.
త్వరలోనే సింగరేణిలో తమ పార్టీ అనుబంధ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. అనంతరం నియోజకర్గంలోని వివిధ పార్టీలకు చెందిన 250 మంది పార్టీలో చేరగా వారికి శ్రీనివాస్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, రాష్ట్ర సం యుక్త కార్యదర్శి శాంతికుమార్, జిల్లా నేతలు వీరబోయిన రాజ్‌కుమార్‌గౌడ్, నెమలిపురి రఘు, మునిగాల కళ్యాణ్‌రాజ్, కె అచ్చిరెడ్డి, డి ప్రకాష్, కె రాజ్‌కుమార్, అప్పం కిషన్, మేకల కేదారియాదవ్, నాగుల దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.