సిమెంట్ కంపెనీలతో..కేసీఆర్ కుమ్మక్కు..!
గుర్రం ముందు గడ్డికట్టి పరిగెత్తించినట్టు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన సాగుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం దేవరకొండలో నిర్వహించిన జన ఆవేదన సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మూడోరోజే కేసీఆర్ సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని పొన్నాల ఆరోపించారు.
దేవరకొండ : గుర్రం ముందు గడ్డి కట్టి పరిగెత్తించిన చందంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి విమర్శిం చారు. దేవరకొండలో నిర్వహించిన జన ఆవేదన సమ్మేళనంలో వారు మాట్లాడారు. 2004 ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ ఫైలుపై సంతకం చేస్తే, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మూడో రోజే సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై వాటి ధరలు పెంచారని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో కొన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తే కేసీఆర్ మాత్రం రెండు గదుల ఇళ్లు రెండు గ్రామాల్లో కట్టి డబుల్ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు గాని, సామాన్య ప్రజానికానికి చేస్తున్నది ఏమీ లేదని అన్నారు. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏక వ్యక్తి పాలన నడుస్తోందని, ప్రజలను పాలించే నైతిక హక్కు ఈ రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కోల్పోయిందన్నారు.
అందుకే ప్రజల్లోకి వెళ్లడానికి జన ఆవేదన సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ నేత కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వినోద్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ జగన్‌లాల్‌నాయక్, వడ్త్యా రమేశ్, మాజీ జెడ్పీటీసీ గుంజ రేణుక, నారాయణ, సత్యనారాయణరెడ్డి, నాయకుడు ఎండీ.యూనూస్, పెద్దయ్య, మన్మథరెడ్డి, కిషన్, ఉమర్, నాగేశ్వర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బతుకు తెలంగాణ కావాలి : పొన్నాల
కొండమల్లేపల్లి : తెలంగాణలో ప్రజలకు బంగారు తెలంగాణ కాదు.. బతుకు తెలంగాణ కావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, జన ఆవేదన కార్యచరణ కమిటీ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ సేకరణ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు యుగేందర్‌రెడ్డి, ఉట్కూరి వేమన్‌రెడ్డి, ప్రమీల వెంకటేశ్, బొడిగె శంకర్‌గౌడ్, పానుగంటి శ్రీకాంత్, జయశంకర్, దామోదర్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులున్నారు.