'టీఆర్ఎస్ని నిలదీస్తాం'
న్యూఢిల్లీ: విభజన చట్టం బిల్లు ప్రకారం 54 శాతం విద్యుత్ వాటా తీసుకురావడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. బుధవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పొన్నాల భేటీ అయ్యారు. అనంతరం పొన్నాల మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చలేకపోయాయని విమర్శించారు.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో టీఆర్ఎస్ను తమ పార్టీ నిలదీస్తుందని అన్నారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలపై సోనియాతో చర్చించినట్లు పొన్నాల ఈ సందర్భంగా వివరించారు. దేశంలోని వివిధ పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్యతోపాటు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి .. రాహుల్ తో మంగళవారం సమావేశమైన సంగతి తెలిసిందే.