పేదింట్లో చదువుల ‘జాబిలి’
♦ బాల్య వివాహం వద్దని..గొప్ప చదువులే ముద్దని..
♦ టెన్త్‌లో 10 జీపీఏ సాధించింది
♦ మెతుకు సీమలో మెరిసిన మమత
పాపన్నపేట: పేదింట్లో చదువుల జాబిలి వికసించింది. పేదరికం పరిహసిస్తుంటే పట్టుదలతో పుస్తకం పట్టింది. లక్ష్య సాధన కోసం నిరంతర శ్రామికురాలిగా మారింది. బాల్య వివాహం వద్దంటూ.. గొప్ప చదువులే ముద్దంటూ కన్న వారిని ఎదిరించింది. చదువే లోకంగా.. ఏకాగ్రతే అస్త్రంగా సన్నద్ధమై పదో తరగతి పరీక్షలు రాసి జిల్లా టాపర్‌గా నిలిచింది. మరి ఇప్పుడు పెద్ద చదువులకే దారేది అంటూ దిక్కులు చూస్తుంది మమత.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాక గ్రామానికి చెందిన ఉప్పరి కిష్టయ్య, శంకరమ్మ దంపతుల పెద్ద కుమార్తె మమత చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణించడంతో రెండవ తరగతి వరకు లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివించారు. కాని అలవి కాని ఆ ఫీజులు భరించలేక మూడు నుంచి కొడుపాక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అయితే, పేదరికం పరిహసిస్తుంటే మమతలో పట్టుదల పెరిగింది. స్నేహితులంతా పాఠశాల నుంచి విహారయాత్రలకు వెళ్తుంటే.. ఇంటి పరిస్థితి తెలసిన మమత మౌనంగా రోదించేది. తోటి వాళ్లు రంగు రంగుల కొత్త బట్టలు వేసుకొస్తే .. ఉన్నవాటితోనే తృప్తిపడేది. కానీ ఈ ఆర్థిక అంతరాలు మమత మనసుపై చెరగని ముద్ర వేశాయి. చదువులపై పట్టుదలను పెంచాయి. క్లాస్‌మేట్స్ గైడ్‌లు కొనుక్కొంటే.. ఉచిత పుస్తకాలనే జల్లెడ పట్టేది.
బాల్య వివాహాన్ని ఎదిరించి..
నిరుపేద తల్లి దండ్రులకు పెద్ద కుటుంబం శాపంగా మారింది. వర్షాలు లేక మంజీరమ్మ తడారి పోవడంతో వీరి వ్యవసాయ భూమి ఎడారిలా మారింది. ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో ఈ యేడు పెద్దమ్మాయి పెళ్లి చేసి కాస్త బరువు దించుకోవాలనుకున్నారు. వారి నిర్ణయం వినగానే మమత నిప్పు కణికలా రగిలింది. ‘అవసరమైతే నా బతుకు నేను బతకగలను.. నన్ను మాత్రం నేను చదివినంత వరకు చదివించండి. అదే జన్మకు పదివేల’ంటూ ప్రాథేయ పడింది.
ఫ్రీ సీటు వస్తేనే చదివిస్తారట..
పట్టుదలతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించా. ట్రిపుల్ ఐటీలో చేరి మంచి ఇంజనీర్ కావాలనుంది. కాని మావాళ్లు మాత్రం ఫ్రీ సీటు వస్తేనే చదివిస్తామంటున్నారు. డబ్బులు కట్టడం మా వల్ల కాదంటున్నారు. ఇంతకీ ట్రిపుల్ ఐటీ పూర్తి చేయడానికి ఎన్ని డబ్బులు అవసరమవుతాయో.. నా లక్ష్యాన్ని ఎలా చేరుతానో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. మనసున్న మారాజు లెవరైనా నాకు దారి చూపి గమ్యం చేర్చాలని వేడుకుంటున్నా. - మమత