
గ్రేటర్‌లోపందేల జోరు..!
- అభ్యర్థుల గెలుపు అవకాశాలపై కాయ్ రాజా కాయ్
- లక్షల్లో చేతులు మారుతున్న డబ్బు
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక పోరు ముగిసింది. గెలుపు అంచనాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు తలమునకలై ఉన్నారు. ఇదే తరుణంలో గ్రేటర్‌లో బెట్టింగ్ జోరందుకుంది. పాతనగరం, ప్రధాన నగరం, శివారు ప్రాంతమన్న తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కాయ్ రాజా కాయ్‌లు పందెం కాసేస్తున్నారు. మహానగరం పరిధిలో దాదాపు 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పందేలు గురువారం ఉదయం నుంచి ఊపందుకున్నాయి.
పందెంరాయుళ్ల స్తోమతను బట్టి వందలు.. వేలు.. లక్షలు ఇలా వివిధ స్థాయిల్లో బెట్టింగ్‌లు షురూ అవుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి నగదు పెరుగుతూనే ఉంది. అభ్యర్థుల గెలుపు, ఓటమి, మెజార్టీ వంటివన్నీ బెట్టింగ్‌కు ముడి సరుకులే అయ్యాయి. ఫలానా పార్టీ అభ్యర్థికి ఈ సారి ఓటమి ఖాయం.. మరో అభ్యర్థి గెలుపు ఖాయం.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి న ఓ నాయకుడికి ఈ సారి మెజార్టీ తగ్గడం తథ్యం..
ఈ అంశాలపైనే సాగుతున్నాయి బెట్టింగ్‌లు. కొన్ని ప్రాంతాల్లో బెట్టింగ్ కోసమే ప్రత్యేకంగా అడ్డాలు వెలియడం గమనార్హం. శివార్లలోని రిసార్టులు, లాడ్జింగ్‌లు, రెస్టారెంట్లు పందేనికి అడ్డాలుగా మారుతున్నట్లు సమాచారం.
ఈ ప్రాంతాల్లో జోరెక్కువ...
నగరంలో తాజా మాజీ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖైరతాబాద్, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్, మల్కాజిగిరీ పార్లమెంటరీ నియోజకవర్గాలు, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, మహేశ్వరం, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో ఈసారి పోలింగ్ శాతం పెరగకపోవడంతో గెలుపు అవకాశాలు ఎవరికి అధికంగా ఉంటాయోనన్న అయోమయం నెలకొనడంతో పందెంరాయుళ్లకు వరంగా మారింది.
అల్పాదాయ వర్గాలు సైతం..
బెట్టింగ్ జోరులో సంపన్నులే కాదు.. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వేతన జీవులు సైతం తమ కష్టార్జితాన్ని బెట్టింగ్‌లో పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సంపన్నులు కాస్తున్న పందేలు లక్షలు దాటుతుండగా.. అల్పాదాయ వర్గాలు వేలల్లోనే బెట్టింగ్ కాస్తున్నారు. కాగా పందెం నిర్వహించేవారు, పందెం కాసేవారు ఎవరికీ అనుమానం రాకుండా సెల్‌ఫోన్లలోనే వ్యవహారం సాగిస్తుండడంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. మరికొందరు శివార్లలోని రిసార్టులో చిన్నపాటి పార్టీలు నిర్వహించి అక్కడే బెట్టింగ్ కాస్తుండడం కూడా సంచలనం సృష్టిస్తోంది.