చెన్నూర్ : మరుగుదొడ్డి నిర్మాణ తవ్వకాల్లో ఇటీవల కూలీలకు లభ్యమైన 34 బంగారు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని కోటబోగూడ ప్రాంతానికి చెందిన గడుదాసు గట్టయ్య ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం 15 రోజుల క్రితం పట్టణానికి చెందిన కూలీలు పెరుకుల రాజు, సత్యనారాయణ, హరీశ్, గంగన్న, గుంజ్ర రమేశ్ గుంత తవ్వుతుండగా అందులో ఒక డబ్బా కనిపించింది.
ఆ డబ్బాను రాజు చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. విషయాన్ని సహచర కూలీలకు చెప్పి అందరూ కలిసి పంచుకున్నారు. ఈ క్రమంలో రాజు గురువారం బంగారు నాణెం అమ్మకానికి తీసుకురాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు చేరుకొని రాజును అదుపులోకి తీసుకొని విచారించగా తవ్వకాల్లో బంగారు నాణేలు దొరికినట్లు తెలిపాడు. ఇంటి యజమాని గట్టయ్యకు సైతం నాణేల్లో వాటా ఇచ్చామని పేర్కొన్నాడు.
ఈ మేరకు రాజు వద్ద ఎనిమిది బంగారు నాణేలు, సత్యనారాయణ, హరీశ్‌ల వద్ద 24, గంగన్న వద్ద రెండు మొత్తం 34 నాణేలు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. గుంజ్ర రమేశ్, ఇంటి యజమాని గట్టయ్య వద్ద ఉన్న నాణేలనూ త్వరలో స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఐదుగురు కూలీలు, ఇంటి యజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
బంగారు నాణేలు స్వాధీనం
Published Fri, Aug 15 2014 12:42 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement