శవ నిరీక్షణ! | postmortems delay in karimnagar hospital | Sakshi
Sakshi News home page

శవ నిరీక్షణ!

Published Thu, Feb 22 2018 9:31 AM | Last Updated on Thu, Feb 22 2018 9:31 AM

postmortems delay in karimnagar hospital - Sakshi

కరీంనగర్‌ ప్రధాన ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం బంధువులకు ఎదురుచూపులు తప్పడంలేదు. అయినవారిని కోల్పోయి కడసారి చూపుకోసం ఆసుపత్రికి వస్తున్నవారు శవపరీక్ష కోసం గంటల తరబడి పోస్టుమార్టం గది వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. ప్రమాదాలబారిన పడి ఆకస్మిక మరణాలు సంభవించి.. ఆసుపత్రికి తీసుకొస్తున్న శవాలకు పోస్టుమార్టం చేయడంలో డ్యూటీ డాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవ్యక్తి ఆకస్మికంగా మృతిచెందితే.. కన్నబిడ్డల మొదలు.. కనిపెంచిన తల్లిదండ్రులు.. కట్టుకున్న భార్య వరకు కుటుంబమంతా ఎంత విషాదంలో ఉంటుందో తెలియంది కాదు. అలాంటి వారికి ధైర్యం చెప్పాల్సిన సమయంలో వైద్యులు పోస్టుమార్టం ఆలస్యం చేస్తూ మరింత తీవ్ర మానోవేదనకు గురిచేస్తున్నారు. దీనికి వారంక్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాద సంఘటనే ఉదాహరణగా నిలుస్తోంది.

వారంక్రితం తిమ్మాపూర్‌ సమీపంలో రాజీవ్‌రహదారిపై ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట కావడంతో పోలీసులు వైద్యచికిత్సకోసం జిల్లాప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో పంపించారు. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యుడు పరీక్షించి.. అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. శవాన్ని బంధువులకు అప్పగించేముందు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నందున అదేరాత్రి మార్చురీ గదికి తరలించారు. అప్పటికి సమయం అర్ధరాత్రి రెండుగంటలే అవుతోంది. ప్రమాద విషయం తెల్సిన బంధువులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. కడసారి చూపుకోసం ఎవరిని ప్రాధేయపడినా.. గది కి వేసిన తాళాన్ని తీసేవారు లేరు. మరుసటిరోజు పోస్టమార్టం నిర్వహిస్తేగానీ.. చివరిచూపునకు నోచుకునే పరిస్థితి లేదు. శవపరీక్ష నిర్వహించాలని ఉదయం ఏడు గంటలకే మృతుడి బంధుమిత్రులు ఆర్‌ఎంవోను కోరారు. డ్యూటీడాక్టర్‌ రాగానే.. ఉదయం 9గంటల వరకే జరిపిస్తామని తెలి పారు. ఆయన చెప్పిన సమయానికి అరగంట ఆలస్యంగా శవపరీక్ష డ్యూటీ డాక్టర్‌ రాజశ్రీ వచ్చారు. ‘మీకోసమే ఎదురుచూస్తున్నాం మేడం..’ అనేలోపే.. ‘ఇప్పుడేకదా వస్తున్నాం.. ఫార్మాల్టీస్‌ పూర్తిచేయండి.. కాగానే వచ్చి చేస్తా..’ అన్నారు.

పంచనా మాకు సంబంధించినవన్నీ రాశారని ఇనీషియల్‌ రిపోర్టు అందించగా.. ఇది సరిపోదు.. పూర్తిగా రాయండంటూ వెళ్లిపోయారు. రిపోర్టులన్నీ పూర్తయ్యాయని సమాచారం అందించినా.. గంటవరకు కూడా రాలేదు. ప్రశ్నిస్తే.. ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్నానని, మత్తుమందు ఇచ్చిన వ్యక్తికి చికిత్స జరుగుతోందని, అది పూర్తయ్యాకే వస్తా.. అంటూ బదులిచ్చారు. పోలీస్‌ సబ్బంది వెళ్లినా ఆమె నిరాకరించారు. అప్పటికే ఉదయం పదిన్నర దాటిపోయింది. అర్ధరాత్రి నుంచి బాధిత కుటుంబసభ్యులు ఏడుస్తున్నారని, పోస్టుమార్టం త్వరగా చేయాలని కోరగా.. ఆ బాధ అర్థం చేసుకున్న మరోడాక్టర్‌ వచ్చి శవపరీక్ష పూర్తిచేశారు. సదరు డాక్టర్‌ బయటకు వస్తుండగా రాజశ్రీ వచ్చి అలా చూసి ఇలా వెళ్లిపోయారు.

కరీంనగర్‌ హెల్త్‌: దేవుడితో సమానంగా కొలువబడుతున్న వైద్యుల్లో మానవత్వం కొరవడుతోందని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శవపరీక్ష కోసం మృతుల బంధువులు పడుతున్న కష్టాలు నిత్యకృత్యం అవుతున్నాయి. సాయంత్రమో, అర్ధరాత్రో మరణిస్తే వారి శవపరీక్షలకు దాదాపు 24గంటలపాటు వేచి ఉండే పరిస్థితులు ఉన్నాయి. మృతుల కుటుంబాల బాధను అర్థంచేసుకుని వెంటనే పరీక్షలు నిర్వహించి పంపించాలని ప్రతి సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచిస్తున్నా.. వైద్యులుమాత్రం పట్టించుకోవడం లేదు.

పంచనామా పేరుతో ఆలస్యం
శవపరీక్షకు మందుగా పంచనామా చేయాలని చెబుతూ వైద్యులు కాలయాపన చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. శవపంచనామాకు ప్రమాదం జరిగిన ప్రాంత పోలీస్‌ అధికారులు నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. ఆ నివేదిక  పూర్తి చేయడానికి పోలీస్‌ సిబ్బంది ఆలస్యం చేస్తున్నారని, తమ తప్పేమీ లేదంటూ తప్పించుకుంటున్నారు. ఈ నివేదికలు తయారు అయ్యాయని సదరు పరీక్ష చేసే డ్యూటీ డాక్టర్‌ తనకు వేరే పని ఉందని, ఆపరేషన్లు ఉన్నాయని, కోర్టులో హాజరు కావాల్సి ఉందని, సమయం అయిపోయందంటూ ఇలా రకరకాల మాట లతో బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలా ఈ తతంగమంతా పూర్తయ్యేలోపు  ఒక్కోసారి బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురై చివరికి ఆస్పత్రిలో చేరుతున్నారు. 

ఆలస్యం చేయడం లేదు– ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంవో     డాక్టర్‌ శ్రీధర్‌
పోస్టుమార్టం నిర్వహించడంలో ఆలస్యం చేయడం లేదు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌  నిబంధనలకు అనుగుణంగా అన్ని పూర్తికాగా నే చేస్తున్నారు. పంచనామా చేయడం, దానికి సంబంధించిన నివేదిక వివరాలు రాయ డం కొంత ఆలస్యం కావడంతో పోస్టుమార్టం కూడా  ఆలస్యం అవుతోంది. రోజుకొకరు చొప్పున డ్యూటీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement