
‘ప్రాణహిత’కు జాతీయ హోదా కల్పించాలి
నల్లగొండ టుటౌన్ : రాష్ట్రంలోని 6 జిల్లాల్లో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించి సస్యశామలం చేసేందుకు రూపొందించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మఖ్దూం భవన్‌లో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
లక్ష రూపాయల వరకు రుణమాఫీని వెంటనే చేయాలన్నారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి స్థానిక నాయకులు చొరవ చూపాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. అనంతరం భువనగిరి సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలుపుతూ సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తీర్మానించారు.
పార్టీ శాసన సభాపక్ష నాయకుడు రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు గులాం రసూల్, గోద శ్రీరాములు, వి.రత్నాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జి.పాండరి, కేవీఎల్, వై.దామోదర్‌రెడ్డి, ఎల్.శ్రవణ్‌కుమార్, పల్లా దేవేందర్‌రెడ్డి, చేడే చంద్రయ్య, బి.భూపాల్, సృజన తదితరులు పాల్గొన్నారు.