
ఎవరెస్ట్‌పై తెలుగు తేజం
రెండోసారి అధిరోహించిన నీరుడి ప్రవీణ్
నారాయణఖేడ్: ఎవరెస్ట్ శిఖరాన్ని రెండోసారి అధిరోహించి తెలుగు కీర్తిపతాకాన్ని ఇనుమ డింపజేశాడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన నీరుడి ప్రవీణ్‌కుమార్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. తొమ్మిది మంది బృందం సభ్యులు గత నెల 21న న్యూఢిల్లీ నుంచి బయలుదేరారు. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి పార్క్ దగ్గరలోని 6,180 మీటర్ల శిఖరాన్ని అధిరోహించారు. అయితే, 9 మంది సభ్యుల్లో ఐదుగురు మాత్రమే ఎవరెస్ట్‌ను ఎక్కారు.
ఇందులో ప్రవీణ్ కుమార్‌తోపాటు అఖిలేశ్, తిరుపతి, తుకారాం, రంగారావు ఉన్నారు. శిఖరాన్ని అధిరోహించిన అనంతరం వీరు జాతీయ జెండాను ఎగురవేశారు. ఎవరెస్ట్ శిఖరారోహణకు ఆర్థిక సహాయం అందజేసిన వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, సత్యసాయిసేవా సమితి జెండాలను సైతం ఆవిష్కరించారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రవీణ్ 5,186 మీటర్ల ఎల్తైన శిఖరాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే.