వరంగల్ జిల్లాలో శిలాయుగం ఆనవాళ్లు
వరంగల్ జిల్లాలో శిలాయుగం ఆనవాళ్లు
Published Sat, Mar 28 2015 8:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM
హైదరాబాద్: వరంగల్ జిల్లా గణపురం మండలం మైలారంలో శిలాయుగం నాటి పురాతన గుహల సముదాయం ఒకటి వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్రపై పరిశోధనలు జరుపుతున్న బృందం ఈ ప్రాంతాన్ని ఇటీవల సందర్శించింది. దీనిపై వారు విస్తృత పరిశోధనలు జరిపి వివరాలను వెల్లడించారు.
మండలంలోని నల్లగుట్టల ప్రాంతంలో 30కి పైగా ఇలాంటి గుహలున్నాయి. క్వార్ట్జ్ ఫెలిస్పాటిక్, కార్బొనేట్ రాళ్లతో ఏర్పడిన శిలాకృతులు ఈ గుహల్లో కనువిందు చేస్తున్నాయి. బొర్రా, బెలూం గుహలకు ఏమాత్రం తీసిపోని విధంగా లోపలి వాతావరణం చల్లగా ఉంది. ఖాళీగా ఉన్న నాలుగు చోట్ల మానవ నిర్మిత రాతి గోడలున్నాయి. గుట్టపై నుంచి లోపలికి దారితీసే సొరంగాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఆదిమానవులు జీవించారనేందుకు ఆనవాళ్లుగా నీటి వనరుల జాడలు, రాతి పనిముట్లు దొరికాయి. ఇవి రాతి యుగానికి(50,000-30,000 సంవత్సరాల నాటివి) చెందినవని పరిశోధకుల అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ పరిశోధనలు జరిపిన బృందంలో రామోజు హరగోపాల్, వేముగంటి మురళీ కృష్ణ, నందకృష్ణ, కట్టా శ్రీనివాస్, అమ్మ కిశోర్, గుర్రాల సుమన్‌రెడ్డిలు ఉన్నారు.
Advertisement