వాట్సప్‌తో వర్తమానం
రాజేంద్రనగర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని బైక్‌రేసర్లు గత రెండు నెలలుగా తమ కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించారు. ఎట్టకేలకు నార్సింగ్ పోలీసులకు చిక్కిన ఈ రేసర్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్స్‌ఆప్‌ల ద్వారా రేసింగ్‌లకు పాల్పడటంతో పాటు బెట్టింగ్స్ కూడా నిర్వహిస్తూ ఆశ్చర్యానికి గురి చేశారు. 12 ఏళ్ల బాలుడు సైతం ఈ రేసింగ్స్‌లో పాల్గొని తన సత్తా చాటడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. సైకిల్‌ను సైతం లేపలేని వయస్సులో బైక్‌ను సునాయాసంగా గాల్లోకి లేపుతూ విన్యాసాలు చేయడం ఔరా అనిపించింది. పోలీసులకు పట్టుబడ్డ 80 మందిలో 15 ఏళ్ల వయస్సులోపు వారే పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రేసర్‌లను ‘సాక్షి’ ఆరా తీయగా పలు విషయాలు వెల్లడించారు.
ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్స్‌ఆప్‌లలో...
బైక్‌రేసర్‌లు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లలో చాటింగ్‌లు, యూట్యూబ్‌లలో తాము చేసిన విన్యాసాలను అప్‌లోడ్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఆదివారం ఎక్కడ? ఎన్ని గంటలకు కలవాలి తదితర విషయాలను ఒక్క రోజు ముందు వాట్స్‌ఆప్‌లో షేర్ చేసుకుంటున్నారు. ఈ విధంగా రేసింగ్ విషయం తమ వారికి తప్ప మరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.
మొదట ఇద్దరు యువకులు....
ప్రతి ఆదివారం యువకులంతా బైక్‌రేసింగ్‌కు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఇద్దరు యువకులు ముందుగా అక్కడికి వెళ్తారు. పరిస్థితులను చూసి వెంటనే వాట్స్‌ఆప్ ద్వారా తమ గ్రూపు సభ్యులకు వచ్చేయమని మెసేజ్ పంపుతారు. నిమిషాల వ్యవధిలో గ్రూప్ సభ్యులంతా చేరుకొని బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్నారు.