
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ నడిబొడ్డున ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉదయం 10.20కు సందర్శించనున్నారు. సాగరం మధ్యన రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ మీద ప్రతిష్టించిన అభయముద్రలో ఉన్న గౌత ముని ఏకశిలా విగ్రహాన్ని ఆయన దర్శించుకోనున్నా రు. రాష్ట్రపతి సందర్శన దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలు లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలను స్వాధీనం చేసుకున్నాయి. పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి.
బుద్ధ విగ్రహం ప్రత్యేకతలివే
బుద్ధుని విగ్రహానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. నాటి సీఎం ఎన్టీఆర్ ఆదేశాలతో భువనగిరి సమీపంలోని రాయిగిరి కొండ నుంచి సేకరించిన వైట్ గ్రానైట్ స్టోన్‌పై చెక్కిన అతి పెద్ద ఏకశిలా విగ్రహం ఇదే. ప్రముఖ శిల్పి గణపతి స్థపతి నేతృత్వంలోని బృందం ఐదేళ్ల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దింది. దీనిని ప్రతిష్టించే క్రమంలో 1990 మార్చి 10న ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. విగ్రహాన్ని తరలిస్తున్న వాహనం నీట మునగడంతో 10 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు. తిరిగి 1992 డిసెంబర్ 1న విగ్రహాన్ని నీటిలో నుంచి వెలికితీసి రాక్ ఆఫ్ జిబ్రాల్టర్‌పై ప్రతిష్టించారు. 2006లో ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా నేతృత్వంలో ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.