
లక్డీకాపూల్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే మాంసం షాపులపై చర్యలు తప్పవని పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరించారు. మాంసం ధరల నియంత్రణ కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఐదు మంది అధికారులతో కూడిన కమిటీ నియమించారు. ఈ మేరకు వారు సోమవారం ఖైరతాబాద్, మణికొండ, బంజారాహిల్స్ ప్రాంతాలలోని ఎనిమిది మాంసం షాపులలో తనిఖీలు నిర్వహించారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బంజారాహిల్స్ రోడ్ నం.11లోని టెండర్ కట్స్ మటన్ షాప్‌ను సీజ్ చేశారు.
తనిఖీకి వెళ్లిన సమయంలో షాప్ బయట నో మటన్ బోర్డ్ పెట్టారని లోపలకి వెళ్లి పరిశీలించగా సుమారు 20కిలోల మటన్ కనిపించిందని అధికారులు తెలిపారు. నిల్వ ఉంచిన మటన్ నుంచి దుర్వాసన రావడంతో వెంటనే ఆ షాప్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. మాంసం ధర రూ.700 పేర్కొంటూ బోర్డ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని షాపుల నిర్వహకులను ఆదేశించారు. తనిఖీల్లో అధికారులు డాక్టర్ బాబుబేరి, సింహా రావు, సుభాష్, నిజాం, ఖాద్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment