సంగారెడ్డి టౌన్: తెలంగాణలో కేవలం కేసీఆర్‌కు లాభం చేకూరిందని, బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తానని చెప్పి నాలుగున్నరేళ్లలో దివాళా తెలంగాణగా మార్చివేశారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించి ప్రజలు కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపనున్నారని, ఉజ్వల తెలంగాణ దిశగా ప్రజాఫ్రంట్ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డికి విచ్చేసిన ఆయన ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు బాగు పడతారని సోనియా, మన్మోహన్‌సింగ్‌లు రాష్ట్రం ఏర్పాటు చేస్తే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కుటుంబ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తే అందరికి లాభం చేకూరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లయినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, మోదీల్లాగా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇవ్వదని, మ్యానిఫెస్టోలో ఉన్నవి అన్నీ నెరవేర్చుతామన్నారు. ఈ ఎన్నికల్లో జగ్గారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, నియోజకవర్గంలో బలమైన నాయకుడు అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలని కేసీఆర్ ఏన్నాడూ అడగలేదన్నారు.
మార్పు వస్తుంది..
వచ్చే నెల 7వ తేదీన ఎన్నికల్లో ప్రజల తీర్పుతో మార్పు వస్తుందని ప్రజాఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఢిల్లీకా రాస్తా హైదరాబాద్‌సే .. హైదరాబాద్‌కా రాస్తా సంగారెడ్డిసే షురూ హోగా అని కూటమి విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో అమలు కోసం ప్రత్యేకంగా జిల్లాకో నాగరిక్ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హమ్ సంవేదన్ శీల్ ... సర్కార్ దేంగే అని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ పనితీరు ఉంటుందన్నారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్, మోదీలు దొందూ దొందేనన్నారు. బీజేపీ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుందని, వారిద్దరికి ఎంఐఎం ఆక్సిజన్ అందిస్తుందని అన్నారు. ఈ పార్టీలతో కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తూ ఉంటుందన్నారు.
కాంగ్రెస్‌తోనే తెలంగాణ..
కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్నారు. అత్యవసరంగా తెలంగాణలో అవినీతిని, లంచగొడితనాన్ని అంతం చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీ సైతం ఫాంహౌస్‌కు వెళ్తారని, బహుషా కేసీఆర్, మోదీ ఒకే ఫాంహౌస్‌కు పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు.
ఆంధ్రాకు ప్రత్యేక కేటగిరి..
తెలంగాణ విభజన సమయంలో ఆంధ్రకు ప్రత్యేక కేటగిరీ ఇస్తామని చెప్పామని ఆయన తెలిపారు. విభజన జరిగిన సమయంలో అందరి కళ్లు హైదరాబాద్‌పైనే ఉన్నాయని, హైదరాబాద్ తెలంగాణకే చెందాలని సోనియా, మన్మోహన్‌లు నిర్ణయించినట్లు తెలిపారు. విభజన సమయంలో హైదరాబాద్ ఆదాయం రూ.16వేల కోట్లు ఉండగా నేడు అది సుమారు రూ.25 వేల కోట్లు ఉందన్నారు. ఈ నిధులన్నీ తెలంగాణ ఖాతాల్లోకి వెళ్లినందున ఆంధ్రకు ఐదు సంవత్సరాల ప్రత్యేక కేటగిరి ఇస్తామని మన్మోహన్‌సింగ్ ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ సర్కార్ ఏర్పడితే 10 సంవత్సరాల ప్రత్యేక కేటగిరి ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామని వెంకయ్యనాయుడు పార్లమెంట్‌లో ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. తిరుపతి పర్యటనలో సైతం మోదీ అబద్ధాలు చెప్పారని, కేటగిరి ఇస్తామని మోసం చేశారన్నారు.
వండివార్చిన బిర్యానీ..
తెలంగాణ ఏర్పడిన సమయంలో హైదరాబాద్ వండివార్చిన బిర్యానీగా ఉందని జైరాం తెలిపారు. హైదరాబాద్‌ను ఎన్‌టీఆర్, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారన్నారు. తయారుగా ఉన్న బిర్యానీ కేసీఆర్‌కు దొరికినప్పటికీ ఇప్పుడు స్పెషల్ కేటగిరిని ప్రశ్నించడం సరికాదన్నారు. దేశంలో ప్రత్యేక కేటగిరిలు ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులో ప్రభుత్వం ఇవ్వగలుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు మోదీని పొగిడిన కేసీఆర్ ఎన్నికలు ఉన్నాయన్న కారణంతో మోదీని విమర్శిస్తున్నారన్నారు. కేసీఆర్‌ది తెలంగాణ కాదని, ఆయన విజయనగరం నుంచి వచ్చిన సెటిలర్ అని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో సంగారెడ్డి శాసనసభ అభ్యర్థి జగ్గారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంతకిషన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment