పండుగ కళ తేవాలి
హైదరాబాద్‌లో బహిరంగసభపై నేతలకు కేసీఆర్ సూచన
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్య నేతలకు ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పల్లెపల్లెనా, ఇంటింటికీ చాటిచెప్పేలా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయాలని సూచించారు. పది నెలల్లో చేపట్టిన బృహత్తర కార్యక్రమాల ప్రచార బాధ్యతలను కార్యకర్తలకు అప్పగించాలని చెప్పారు. 27న (సోమవారం) పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ విజయోత్సవ సభగా జరుపుకోవాలని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు మహమూద్ అలీ, పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్, నాయిని, మహేందర్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో సీఎం సమీక్షించారు.
అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో.. హైదరాబాద్‌లో పండుగ వాతావరణం ఉట్టిపడాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను, బహిరంగ సభను విజయవంతం చేసే బాధ్యతలను పార్టీ ఇన్‌చార్జులకు అప్పగించాలని కూడా సూచించారు. జిల్లాకు లక్ష మందికి తక్కువ కాకుండా పది లక్షల మంది జనాన్ని బహిరంగ సభకు తరలించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. కాగా సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం నల్లగొండలో జరిగే ఒక వివాహానికి హాజరుకానున్నారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గంలోని చందుపట్లలో మిషన్ కాకతీయ కార్యక్రమంలో పాల్గొంటారు.