లక్ష్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే
విద్యార్థులు.. నిత్యం పుస్తకాలతో కుస్తీ.. మార్కులపైనే దృష్టి. కానీ.. గురువుల ప్రోద్బలం.. ప్రోత్సాహంతో వయసుకంటే కంటే పెద్ద సాహసం చేశారు.. ఏకంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.. అందరి మన్ననలు పొందారు విద్యార్థులు పూర్ణ, ఆనంద్. ఈ ఘనత సాధించిన వారిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వ విద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు.
కేయూక్యాంపస్ : లక్ష్యంతో ముందుకెళ్తే దేనినైనా సాధించవచ్చని, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లే అందుకు సాక్ష్యమని అర్బన్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వవిద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ,అనంద్‌లను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ.. జీవితంలో అనేక సవాళ్లు ఎదరవుతాయని, సానుకూల దృక్పథంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు.
చిన్నవయసులోనే పూర్ణ, ఆనంద్‌లు ఎవరెస్టు శిఖరం అధిరోహించడం గర్వకారణమన్నారు. కేయూ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు మాట్లాడుతూ విద్యార్థులు అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. గురుకుల విద్యార్థుల కోసం ప్రవీణ్‌కుమార్ చేస్తున్న వివిధ కార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయన్నారు. క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే ప్రణాళిక బద్ధంగా లక్ష్యంతో చదువుకుంటే అనుకున్న స్థానానికి చేరుకోవచ్చన్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది గురుకులాల్లో డిగ్రీ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సభకు స్వారోస్ జిల్లా అధ్యక్షుడు పట్టాభి అధ్యక్షత వహించారు. స్వారోస్ రాష్ర్ట కోకన్వీనర్ చలపతి, రాష్ట, జిల్లా స్వారోస్ బాధ్యులు పుల్లాకిషన్, రవి, కరుణాకర్, ఒంటేరు చక్రి, సదానందం, పరుశరామ్, కుంటా శ్రీనివాస్, మహేష్ , శోభన్‌బాబు, మానస, పీఈటీ శ్రీలత పాల్గొన్నారు.
కలెక్టర్ అభినందన
జిల్లాలోని స్వారోస్ కమిటీ సన్మాన కార్యక్రమానికి వచ్చిన పూర్ణ, ఆనంద్‌లకు సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హన్మకొండలోని కీర్తిస్తూపం నుంచి ర్యాలీ ప్రారంభించారు. తొలుత కలెక్టర్ కిషన్‌ను కలిసిన పూర్ణ, అనంద్‌లను ఆయన అభినందించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకున్నారు.