
దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ పీవీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి వేణుగోపాలాచారి వ్యాఖ్య
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు యావత్ దేశం గర్వించదగ్గ తెలుగు ముద్దుబిడ్డ అని, తెలుగు వారందరికీ ఆదర్శనీయులని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. శనివారం సాయంత్రం ఏపీభవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన పీవీ నరసింహారావు 93వ జయంతి వేడుకలకు వేణుగోపాలాచారి, తెలంగాణ రాష్ట్ర మరో ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాలచారి మాట్లాడుతూ... దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప మేధావిగా కొనియాడారు.
పీవీ అపరచాణుక్యుడేకాక అభినవ ఆర్థిక సంస్కర్తగా రామచంద్రు అభివర్ణించారు. తెలుగుజాతికి వన్నెతెచ్చిన పీవీ జయంతి, వర్థంతి కార్యక్రమాలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాలని ఆశించారు. ఈ కార్యక్రమానికి ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, సిబ్బంది హాజరయ్యారు.