
సాక్షి, హైదరాబాద్: భారత్‌కు సంస్కారం, గొప్ప చరిత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని, ఆయనలాంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పీవీ నరసింహారావు గురించి చెప్పడానికి కొంత సాహసం కావాలని, ఒక్క మాటలో చెప్పాలంటే 360 డిగ్రీస్ పర్సనాలిటీ పీవీ నరసింహారావు కొనియాడారు.
(చదవండి : పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్ నివాళి)
పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలియని, గొప్ప సంస్కరణ శీలి అని అన్నారు. సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమని సీఎం కీర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గురుకుల పాఠశాలలను తీసుకొచ్చింది పీవీనే అని, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చిన నేత పీవీ నరసింహరావని.. మన పీవీ మన తెలంగాణ ఠీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు.
భూసంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మంది పేదలకు న్యాయం చేశారన్నారు. 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అని,ఆయన ఏ రంగంలో ఉన్న అందులో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. విద్యాశాఖను మానవవనరుల శాఖగా మార్చడమే కాకుండా నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టి అనేక మంది ప్రతిభావంతుల్ని దేశానికి అందించారన్నారు. 360 డిగ్రీలపర్సనాలిటీ అని పీవీ చరిత్రపై ఓ పుస్తకమే రాయొచ్చని సలహా ఇచ్చారు. ఆయన జీవిత చరిత్ర వ్యక్తిత్వ పఠిమను పెంపొదించుకోవడానికి ఉపయోగపడుతందని సీఎం కేసీఆర్ అన్నారు.