
నాణ్యత పాటించే కాలేజీలకే మనుగడ
రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు పాటించే కాలేజీలకే మనుగడ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్: రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు పాటించే కాలేజీలకే మనుగడ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలను మూసేయడం తమ ఉద్దేశం కాదని, నాణ్యత ప్రమాణాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 288 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.70 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా ఎంసెట్‌లో కేవలం 70 వేల మందే క్వాలిఫై అవుతున్నారని చెప్పారు. ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్ నిబంధనలను పాటించే కాలేజీలే ఉంటాయని, నాణ్యత పాటించని కాలేజీలెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్సిటీల కోసం చట్టాన్ని రూపొందిస్తున్నామని, దీనికి 2-3 నెలల సమయం పడుతుందని తెలిపారు.
సమస్యల్లోనూ ఫలితాలివ్వడం అభినందనీయం: చుక్కా రామయ్య
కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఇంటర్ బోర్డులో అనేక సమస్యలు, ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ పట్టుదలతో పనిచేసి, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించి ఫలితాలివ్వడం అభినందనీయమని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల ఫలితాలు కూడా బాగున్నాయని, అయితే ఇంకా పక్కాగా చర్యలు చేపట్టాలని బుధవారం ఆయన పేర్కొన్నారు.