
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పంచాయతీ ఎన్నికలపై చర్చించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల తర్వాత వర్షాకాల సమావేశాలు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు.
బీసీలు 54 శాతం దాటినా దాని ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపుల్లో ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యలోనే చదువు మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలన్నారు.
గతేడాది 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తామని సీఎం అనేక సార్లు ప్రకటన చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే బీసీలందరికీ స్టయిపండ్ మంజూరు చేయాలన్నారు. సమావేశంలో బీసీ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.