
22న టీడీపీలోకి ఆర్.కృష్ణయ్య!
తెలంగాణలో టీడీపీ గెలిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రచారం చేస్తూ, పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తుండటంతో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ నెల 22న ఆ పార్టీలో చేరటానికి సిద్ధమయ్యారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ గెలిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రచారం చేస్తూ, పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తుండటంతో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ నెల 22న ఆ పార్టీలో చేరటానికి సిద్ధమయ్యారు. 2004, 2009 ఎన్నికలు, ఆ తర్వాత ఉపఎన్నికల్లో ఓటమి పాలైన సందర్భంగా పార్టీకి బీసీలు దూరమయ్యారని అంచనాకు వచ్చిన టీడీపీ ఆ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ఈసారి అనేక హామీలను గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఊగిసలాటలో ఉన్న కృష్ణయ్య 22న పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని టీడీపీ వర్గాలు చెప్పాయి. కృష్ణయ్య చేరుతున్నందునే ఆ రోజున మహబూబ్‌నగర్‌లో తలపెట్టిన బహిరంగ సభను చంద్రబాబు వాయిదా వేసుకున్నారని కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం ఎన్‌టీఆర్ భవన్లో బుధవారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో తెలిపారు. ఒకవేళ ఆ రోజు వీలుకాని పక్షంలో 23న కృష్ణయ్య టీడీపీలో చేరతారని చెప్తున్నారు.
బాబు చెబితే పాకిస్తాన్‌లోనైనా పోటీ: వేణుమాధవ్
తనకు పాకిస్తాన్ దేశంలో కూడా అభిమానులున్నారని... చంద్రబాబు చెబితే అక్కడి నుంచైనా పోటీ చేస్తానని హాస్యనటుడు వేణుమాధవ్ అన్నారు. బుధవారం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. నల్గొండ జిల్లా కోదాడ లేదా హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని బాబును కోరారు. అనంతరం వేణుమాధవ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీతో తనకు అనుబంధం ఉందని పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేనిది చంద్రబాబు చెబుతారని వెల్లడించారు.
పార్టీని వీడను.. ఎర్రబెల్లి: తాను టీడీపీని వీడేది లేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణ ద్రోహులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. చివరకు లగడపాటి, జగ్గారెడ్డిలను చేర్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.