
రేసర్ల ఆటకట్టు
- గండిపేట కట్టపై బైక్ రేసింగ్
- నార్సింగి పోలీసుల అదుపులో 80 మంది యువకులు
- విడిపించుకెళ్లిన ఎమ్మెల్యే
మణికొండ: నగరశివార్ల రోడ్లు యువతకు రేసింగ్ పాయింట్‌లుగా మారాయి. పలుమార్లు జరిమానాలు, కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఫలితం కనిపించడంలేదు. ఆదివారం ఏకంగా 80 మంది బైక్ రేసింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిపేట చెరువు కట్టపై ప్రతి ఆదివారం నగరంనుంచి యువకులు వచ్చి బైక్ పోటీలు పెట్టుకుంటున్నారు. వీటిని నివారించేందుకు మూడు వారాలుగా నార్సింగ్ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.
రెండు వారాల క్రితం 34 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించి రూ.1000 చొప్పున జరిమానా విధించి విడిచిపెట్టారు. అయినా తిరిగి ఆదివారం గండిపేట కట్టపై రేసింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం రావటంతో పోలీసులు వెళ్లారు. ఒకవైపు కట్టపై ఉన్న గేటు మూసి మరోవైపునుంచి వారిని వెంబడించడంతో వెళ్లేందుకు మరో దారిలేక 80 మంది యువకులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఏకంగా 75 మంది 15 ఏళ్లలోపు వారే ఉన్నారు. వీరిలో చాలా మందికి వాహన లెసైన్స్ కూడా లేదు. వీరంతా పాతబస్తీకి చెందిన వారని తేలింది. వారితో పాటు 31 బైక్‌లను నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సందడిగా మారిన స్టేషన్....
ఏకంగా 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ముందుగా వారంతా రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, నార్సింగి సీఐ ఆనంద్‌రెడ్డిని కలిశారు. తమ పిల్లలు రేసింగ్‌లకు వస్తున్న విషయం తమకు తెలియదని, అలాంటివి చేస్తే తాము సహించమని చెప్పారు.
హామీ తీసుకుని విడిచి పెట్టిన పోలీసులు...
పట్టుబడిన యువకులను రంజాన్ పండగను దృష్టిలో పెట్టుకొని విడిచిపెట్టాలని చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రి పోలీసులను కోరారు. దాంతో వారందరినీ సోమవారం ఉదయం సైబరాబాద్ సీపీ కార్యా లయానికి తీసుకొస్తామని హామీ తీసుకొని వదలిపెట్టారు. సోమవారం పట్టుబడ్డ యువకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు సమాచారం.