పోలీసులకు పట్టుబడిన యువకులు
సాక్షి, చెన్నై: బైక్ రేసింగ్ పేరిట రోడ్డెక్కే యువతపై కొరడా ఝుళిపించే విధంగా నగర పోలీసు యంత్రాంగం మంగళవారం రాత్రి కొరడా ఝుళిపించింది. మెరీనా తీరం, అన్నాసాలై, రాయపేట, రాయపురంలలో రేసింగ్ జోరుతో దూసుకొచ్చిన వంద మంది కుర్రకారును అరెస్టు చేశారు. యాభైకు పైగా బైక్‌లను సీజ్ చేశారు.
నగరంలో కుర్ర కారు సాయంత్రం వేళ బైక్‌లలో చక్కెర్లు కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎనిమిది, పదో తరగతి విద్యార్థులు సైతం తమ వాళ్ల బైక్‌లను రోడ్డెక్కిస్తూ హుషారుగా చక్కర్లు కొడుతూ ప్రమాదం బారిన పడుతున్నారు. ఇక, కళాశాలల విద్యార్థుల ఆకతాయి తనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు బైక్ జోరుతో రేసింగ్‌లకు పాల్పడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అతి వేగంగా వీరు దూసుకెళ్లడమే కాదు, ఇతర వాహన దారుల్ని సైతం ప్రమాదాల బారిన పడే రీతిలో వ్యవహరిస్తున్నారు. నగరంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటుండడంతో సర్వత్రా బెంబేళెత్తక తప్పడం లేదు. ఈ ప్రమాదాల్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు స్కూళ్లకు మోటార్ సైకిళ్లపై వస్తే అన్ముతించొద్దంటూ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, కళాశాల విద్యార్థులు లైసెన్స్‌లు లేకుండా వస్తే అనుమతించొద్దన్న హెచ్చరికను ఉన్నారు.
బైక్ రేసింగ్ : హెచ్చరికలు చేసినా, కఠిన నిర్ణయాలు తీసుకున్నా, జరిమానా మోత మోగించినా కొన్ని చోట్ల కుర్రకారు బైక్ రేసింగ్‌ల పేరిట పందేలు కాసుకుంటూ రోడ్డుపై రయ్యూమంటూ దూసుకెళ్తూనే ఉన్నారు. రోడ్డు మీద ఇతర వాహనాలు సైతం ప్రమాదం గురయ్యే విధంగా వీరి వీరంగాలు సాగుతున్నాయి. ప్రధానంగా ఉదయం, రాత్రుల్లో మెరీనా తీరం, కామరాజర్ సాలై, శాంతోమ్ రోడ్డు, అడయార్, తిరువాన్మీయూర్, ఓఎంఆర్, ఈసీఆర్ రోడ్డు, తాంబరం, వండలూరు – కేలంబాక్కం మార్గాల్లో జోరుగా ఈ రేసింగ్ సాగుతున్నట్టు చెప్పవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు రేసింగ్ వ్యవహారం బయటకు వస్తుండగా, మిగిలిన సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా పందేలు కాసుకుంటూ దూసుకెళ్తోన్నారు. అలాగే, ఏదేని అతి పెద్ద ప్రమాదం అన్నది జరిగినప్పుడు మాత్రం నగర పోలీసు యంత్రాంగం మేల్కొని బైక్ రేసింగ్‌పై కొరడా ఝుళిపించడం పరిపాటే.
వంద మంది అరెస్టు ....
బైక్ రేసింగ్‌లకు కల్లెం వేయడం, విద్యార్థులు, యువత బైక్ జోరుకు బ్రేక్‌లు వేయడం లక్ష్యంగా తమకు చిక్కే వారిని నాన్ బెయిల్ సెక్షన్ల కింద అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించినా, అది అమల్లో విఫలం కాక తప్పడం లేదు. ఎవరైనా పట్టుబడితే చాలు సిఫారసులు ఎక్కువే. చివరకు వారిని వదలి పెట్టాల్సిన పరిస్థితి అనేక పోలీసుల స్టేషన్ల పరిధిలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి అన్నా సాలైం, రాయపురం, రాయపేట, మెరీనా తీరం పరిసరాల్లో బైక్ రేసింగ్‌కు పెద్ద ఎత్తున యువత సన్నాహాలు చేసి ఉన్నట్టుగా మైలాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయా మార్గాల్లో పోలీసులు మాటేశారు. అక్కడక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఆయా మార్గాల్లో జట్టులు జట్టులుగా దూసుకొచ్చిన కుర్ర కారు మీద కొరడా ఝుళిపించారు. కొందురు అయితే, తప్పించుకు వెళ్లారు. మరి కొందరు పోలీసులకు చిక్కారు. సుమారు వంద మందిని అరెస్టు చేసిన పోలీసులు, యాభైకు పైగా బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు తప్పించుకు వెళ్లడంతో సీసీ కెమెరాల దృశ్యాల మేరకు ఆయా వాహనాల నంబర్ల ఆధారంగా పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పట్టుబడ్డ వారిని బుధవారం ఉదయం పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు. అయితే, వారి బైక్‌లను మాత్రం ఇవ్వలేదు.అందరి మీద కేసులు నమోదు చేసి, కోర్టు విచారణను ఎదుర్కొని, అక్కడ బైక్‌లను తీసుకోండన్నట్టుగా సూచించి పంపించారు. దీంతో ఆ విద్యార్థులు బైక్‌లను పోలీసు స్టేషన్ల వద్దే వదలి పెట్టి కోర్టు విచారణల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. ఈ బైక్‌లలో అత్యధికం విలువైనవి కావడంతో వాటికి సంబంధించిన యువతలో ఆందోళన తప్పడం లేదు. తమ బైక్‌ల కోసం పోలీసుస్టేషన్ల వద్దే వారు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment