
రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది గురువారం ఓ విషసర్పాన్ని బంధించారు. ప్రశాసన్ నగర్‌లోని ఉన్నతాధికారుల క్వార్టర్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి నివసిస్తున్నారు. ఆయన నివాసం వెనుక ఉన్న స్థలంలో పాము తారసపడింది. పడగ విప్పి బుసకొడుతున్న పామును చూసిన వాళ్లు భయాందోళనలకు లోనయ్యారు. ఇంతలో విషయం తెలుసుకున్న రాజీవ్ త్రివేది అక్కడకు చేరుకున్నారు. తన వద్ద ఉన్న ఉపకరణంతో ఆ పామును చాకచక్యంగా పట్టుకుని ప్లాస్టిక్ జార్‌లో బంధించారు. దానికి ఎలాంటి హానీ తలపెట్టనని, జనావాసాలకు దూరంగా వదిలివేస్తానని ఆయన పేర్కొన్నారు.
– సాక్షి, హైదరాబాద్