మెదక్/సంగారెడ్డి, న్యూస్‌లైన్: ఎట్టకేలకు జిల్లా విద్యాశాఖాధికారి గాజర్ల రమేష్ బదిలీ అయ్యారు. ఆదివారం ఉదయం కొత్త డీఈఓగా రాజేశ్వర్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మెదక్ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రమేష్‌తో ఉపాధ్యాయ సంఘాలకు ఏర్పడిన భేదాభిప్రాయాల వల్ల విద్యాశాఖలో వివాదానికి దారి తీసిన విషయం విదితమే. 2012 ఏప్రిల్‌లో రమేష్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే విద్యాశాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలో ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల స్థాయి, నిధుల వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ పాఠశాలలను సందర్శిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తూ.. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించారన్న వాదనలున్నాయి. 2013 ఫిబ్రవరిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డిని సస్పెండ్ చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఒక్కసారిగా ఆయనపై మండిపడ్డాయి.
రమేష్ కఠిన వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఉపాధ్యాయులంతా సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. స్పందించిన అప్పటి కలెక్టర్ దినకర్‌బాబు ఉపాధ్యాయుల సంఘాలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కాని డీఈఓకు ఉపాధ్యాయ సంఘాల మధ్య అంతరం అలాగే కొనసాగింది. రమేష్ పనిచేసిన రెండేళ్ల కాలంలో పలువురు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతోపాటు సుమారు 46 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఓ ప్రైవేట్ పాఠశాల విషయమై సంగారెడ్డి ఎమ్మెల్యేకు డీఈఓ రమేష్ మధ్య వివాదం నెలకొంది. ఇదే సమయంలో డీఈఓ రమేష్ పదోన్నతులను ఇవ్వకపోవడం వల్ల ఉపాధ్యాయులు నష్టపోయారని, డీసీసీబీ నిధులను తన కార్యాలయానికి వినియోగించుకున్నారని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ వివాదాలు ముదిరి పాకాన పడటంతో ఫిబ్రవరి 2014లో డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే డీఈఓ రమేష్ అప్పటికే ఎన్నికల విధుల్లో భాగంగా మ్యాన్ పవర్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారిగా పనిచేస్తున్నందున ఆయన బదిలీ ఆగిపోయింది. అనంతరం ఎన్నికల విధులు ముగిసినందున ఆదివారం రాజేశ్వర్ మెదక్ డీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, రమేష్ బదిలీపై డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు వెళ్లిపోయారు.
సమష్టి కృషితోనే విద్యాభివృద్ధి: డీఈఓ రాజేశ్వర్
ఉపాధ్యాయులు, అధికారుల సమష్టి కృషితోనే విద్యాభివృద్ధి జరుగుతుందని డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిని సందర్శించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెదక్ జిల్లాను విద్యాపరంగా ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట విద్యాశాఖ అధికారులు భుజంగం, గీతా, చర్చి ప్రాపర్టీ మేనేజర్ సుబ్రహ్మణ్యం, సంగారెడ్డి డిప్యూటీ ఈఓ శోభారాణి తదితరులు ఉన్నారు.
కొత్త డీఈఓగా రాజేశ్వర్
Published Sun, May 18 2014 11:46 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement