29.03% పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం.. గతేడాదితో పోలిస్తే పెరిగిన డాక్యుమెంట్లు 2.7 లక్షల పైమాటే.. ఎన్నికల ఏడాదిలోనూ ఏమాత్రం తగ్గని రాబడి.. రిజిస్ట్రేషన్ల విభాగానికి 955 కోట్ల అధిక ఆదాయం గతేడాదితో పోలిస్తే 62 శాతం ఆదాయ వృద్ధితో టాప్‌లో మెదక్
(సాక్షి, నెట్‌వర్క్) : రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ జిల్లాల్లో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఎన్నికల ఏడాదిలోనూ ఏమాత్రం మందగమనం లేకుండా ఆదాయం పెరిగింది. గడిచిన ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ల విభాగం ఆదాయం ఏకంగా 29.03 శాతం ఎగబాకింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెరుగుదలే దీనికి కారణం. కరువు జిల్లాగా పేరొందిన మెదక్ జిల్లాలో ఆదాయం 62 శాతం పెరుగుదల నమోదు కాగా, 49.78 శాతంతో మహబూబ్‌నగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కాగా అతితక్కువ పెరుగుదల హైదరాబాద్ జిల్లాలో నమోదైంది. 2017 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్‌లో ఆదాయం 3,292 కోట్లు రాగా.. 2018, ఏప్రిల్–డిసెంబర్‌లో ఆదాయం 4,247 కోట్లకు ఎగబాకింది.
అంటే దాదాపు రూ.955 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. నోట్ల రద్దు తరువాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని భావించినా, ప్రజలు తమ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయకుండా భూములు, ప్లాట్లు, ఫ్లాట్లపైనే పెట్టుబడి పెడుతున్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఐలు సైతం స్థిరాస్తి కొనుగోళ్లపై ఆసక్తి కనపరుస్తుండటంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వం భూమి ధరలను పెంచకపోయినా.. ప్రజలు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడమే ఆదాయం పెంపునకు కారణమని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేస్తుండటంతో.. ఆయా ప్రాంతాల్లో భూముల రేట్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అనుమతి లేని వెంచర్లలోనూ ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. పట్టణాభివృద్ధి సంస్థలు లేదా డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతించిన లే–అవుట్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయడం మంచిదని ప్రచారం చేసినా.. అక్రమ వెంచర్లలోనూ ప్లాట్ల విక్రయాలు సాగుతున్నాయి. ప్రధానంగా ఇలాంటి వెంచర్లు గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది 2.72 లక్షల మేర అదనపు రిజిస్ట్రేషన్లు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment