సాక్షి, గద్వాల: స్థానిక మున్సిపాలిటీలో రెబల్స్‌గా రంగంలోకి దిగిన అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో తప్పనిసరిగా పోటీలో ఉండేందుకు నిర్ణయించుకున్న వారే ఉన్నారు. శనివారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు రెబల్స్ అభ్యర్థులు రహస్య ప్రదేశాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గద్వాలలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీలో రెబల్స్ ఎక్కువగా ఉండటం, పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని ఒత్తిడి వచ్చే అవకాశం ఉండటంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. అయిజ, అలంపూర్, వడ్డేపల్లిలో సైతం రెబల్స్ ముఖ్య నాయకులకు అందుబాటులో లేకుండాపోయారు. కార్యకర్తలు మాత్రం హడావుడిగా తిరగడం కనిపిస్తోంది.
ఉపసంహరణకు యత్నాలు..
పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసిన పలువురిని ఉపసంహరించేందుకు ముఖ్య నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. నయానో.. భయానో.. ఉపసంహరించుకునేందుకు చర్యలు చేపట్టారు. కొన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థికి పోటీగా ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి తమ పోటీదారులను విరమింపజేసేందుకు అన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా బేరసారాలు ప్రారంభించారు. గద్వాలలో ఈ పరిస్థితి కొంత ఎక్కువగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment